Nizamabad Husband And Wife: పచ్చని సంసారాల్లో ‘అనుమానం’ కల్లోలం రేపుతోంది. పెనుభూతంగా మారుతోంది. కుటుంబంాలను విచ్చిన్నం చేస్తోంది. క్షణికావేశంతో నిండు ప్రాణాలను బలిగొంటోంది. హత్యలకు పురిగొల్పుతోంది. కుటుంబసభ్యులకు అంతులేని విషాదం మిగుల్చుతోంది. చిన్నారులను అనాథలను చేస్తోంది. వీటన్నింటికీ ‘అనుమానమే’ బీజం నాటుతోంది. ఇటీవల ఇటువంటి ఘటనలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇటువంటి ఘటనే నిజమాబాద్ లో వెలుగుచూసింది. అనుమానంతో భర్త యువతిని దారుణంగా హత్యచేశాడు. స్థానికంగా ఈ హత్య సంచలనం రేకెత్తించింది. హత్యచేసిన తరువాత భర్త ఏంచేస్తాడో తెలిస్తే షాకవుతారు.

నిజామాబాద్ నగరానికి చెందిన సయ్యద్ ఖలీం కూతురు అనీస్ ఫాతిమాకు 2013లో సయ్యద్ సుల్తానుతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. తొలినాళ్లలో వీరి జీవితం సాఫీగానే సాగిపోయింది. ఫాతిమా చాలా సౌమ్యురాలు. అందంగా ఉంటుంది. ఆ అందమే ఆమెకు శాపంగా మారింది. ఆమె ఎవరితో మాట్లాడినా..ఏంచేసినా భర్త సయ్యద్ సుల్తాన్ అనుమానించడం ప్రారంభించాడు. భార్య వేరే వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించాడు. శారీరకంగా, మానసికంగా వేధించాడు. దీనికి అత్త సైతం వంతపాడడంతో భర్త చేయిచేసుకోవడం ప్రారంభించాడు. దీంతో పంచాయితీ పెద్దల వరకూ వెళ్లింది. దంపతులిద్దర్ని సముదాయించారు. కానీ భర్త సయ్యద్ సుల్తాన్ తీరు మారలేదు. ఎప్పటిలాగే వేధించడం ప్రారంభించాడు. దీంతో విసిగివేశారిపోయిన ఫాతిమా నెల రోజుల నుంచి తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని నిజమాబాద్ లోని వేరేగా ఇల్లు తీసుకుంది. అక్కడే నివాసముంటుంది.

ఈ నేపథ్యంలో ఈ నెల 10న సయ్యద్ సుల్తాన్ తన మామ ఖలీంకు ఫోన్ చేశాడు. తాను ఫాతిమా వద్దకు వెళుతున్నట్టు చెప్పి ఫోన్ కట్ చేశాడు. అక్కడకు కొద్దిసేపటికి మరోసారి ఫోన్ చేశాడు. మీ కుమార్తెను చంపేశానని.. ఇద్దరు పిల్లను తన వెంటనే తీసుకెళుతున్నట్టు చెప్పాడు. దీంతో హుటాహుటిన ఫాతిమా ఉంటున్న ఇంటికి తండ్రి ఖలీం చేరుకున్నాడు. చున్నీతో ఉరివేసుకొని కనిపిస్తూ కుమార్తె ఫాతిమా విగతజీవిగా కనిపించింది. దీంతో కన్నీరుమున్నీరైన ఖలీం పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. క్లూస్ టీమ్ ను రప్పించి వివరాలను నమోదుచేసుకున్నారు. అనుమానంతో కుమార్తె ఫాతిమాను భర్త సయ్యద్ సుల్తాన్ దారుణంగా హత్యచేశాడని ఖలీం ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ విజయబాబు తెలిపారు.