
Uttarandhra YCP: టీడీపీకి కంచుకోటగా నిలిచే ఉత్తరాంధ్రలో వైసీపీ సత్తా చాటింది. దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. 32 నియోజకవర్గాలకుగాను చచ్చీచెడి ఆరు స్థానాలను నిలబెట్టుకుంది. అందులో విశాఖ నగరంలో నాలుగు సీట్లు అయితే.. శ్రీకాకుళంలో రెండు స్థానాలతో సరిపుచ్చుకుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో అసలు బోణీయే కొట్టలేదు. జగన్ ప్రభంజనలంలో వీరు వారు అన్న తేడా లేకుండా వైసీపీ టిక్కెట్ దక్కించుకున్న వారంతా విజయతీరాలకు చేరారు. ఎమ్మెల్యేలు అయిపోయారు. అయితే ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం నిలబెట్టుకోలేకపోయారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎదురీదక తప్పదని హెచ్చరికలు అందుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కొంతమంది తాము సొంత బలంతోనే గెలిచామన్న భావనతో ఉన్నారు. అటువంటి వారికి సొంతపార్టీల నుంచి చుక్కెదురవుతోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తే ఓడించి తీరుతామని సొంత పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారు. అయితే ఉత్తరాంధ్రలో గట్టి ప్రతిగాలి వీస్తుండగా.. అందులో హేమాహేమీలు ఉండడం విశేషం.
ఉత్తరాంధ్రలో కౌంట్ డౌన్ ఎదురయ్యే మొదటి స్థానం పలాస. ఇక్కడ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికలకు ఏడాది ముందు అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ అప్పలరాజు అందరి అభిమానాన్ని చూరగొన్నారు. డాక్టర్ గా మంచి పలుకుబడితో ప్రజలకు దగ్గరయ్యారు. జగన్ ప్రభంజనంలో ఒక చాన్సిస్తే పోలే అంటూ ప్రజలు డాక్టర్ ని ఎమ్మెల్యే చేశారు. అక్కడికి ఏడాది తిరగక ముందే మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్నారు. సాటి నేతలు అసూయ పడేలా రోజురోజుకూ రాటుదేలారు. అయితే ఈ క్రమంలో ఆయన హుందాతనం మరిచి నోరు పారేసుకోవడం ప్రారంభించారు.రాజకీయ ప్రత్యర్థి మహిళ అని చూడకుండా తూలనాడారు. గత ఎన్నికల్లో తన గెలుపునకు కారణమైన వారిని దూరం పెట్టారు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. ఈ ఎమ్మెల్యే తమకు వద్దు బాబోయ్ అంటూ పలాస ప్రజలు తేల్చిచెబుతున్నారు. ఇటీవల ఓ సర్వేలో 28 శాతం మంది మాత్రమే ఆయనకు మద్దతు పలికారు. టీడీపీ మహిళా అభ్యర్థి అయిన గౌతు శిరీషకు ఏకంగా 39 మంది పట్టం కట్టారు. దీంతో డాక్టర్ కానీ టిక్కెట్ ఇస్తే ఓటమి తప్పదని సొంత పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.

శ్రీకాకుళం నియోజకవర్గంలో సైతం మంత్రి ధర్మానకు ఏమంత ఆశాజనకంగా లేదు. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో ఏడు వేల ఓట్లతో బయటపడగలిగారు. కానీ ఈసారి మంత్రి ఎదురీదక తప్పదు. ఆ భయంతో కాబోలు శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికలు జరుగకుం్డా అడ్డుకున్నారన్న టాక్ ధర్మానపై ఉంది. అయితే మంత్రి పదవి ఆలస్యంగా రావడం, గతంలో మాదిరిగా స్వేచ్ఛ లేకపోవడంతో అనుచరులు ఏంచేయాలేకపోతున్నానన్న బాధ ధర్మానలో కనిపిస్తోంది. పైగా ఎన్నో ఆశలు పెట్టుకున్న శ్రీకాకుళం నగర ప్రజలు అభివృద్దేమీ లేకపోవడంతో ఆగ్రహంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో దెబ్బ తప్పదన్న విషయం గుర్తించగలిగారు. స్వయంగా సర్వేలు చేసుకున్నాఏమంతా మంచి గ్రాఫ్ కనిపించడం లేదు. అందుకే తరచూ ఉత్తరాంధ్ర ప్రజలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీకింకా సైకిల్ పై యావ తగ్గలేదని బహిరంగాంగానే కామెంట్స్ చేస్తున్నారు.
ఆమదాలవలస నియోజకవర్గంలో స్పీకర్ తమ్మినేని సైతం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఈసారి ఆయనకు ఓటమి తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో ఒక చాన్సిద్దామని భావించి ఆమదాలవలస ప్రజలు తమ్మినేనిని గెలిపించారు. అయితే ఆశించిన స్థాయిలో ఆయన పనిచేయడం లేదన్న అపవాదును మూటగట్టుకున్నారు. పైగా పాలనలో కుమారుడు, కుటుంబ సభ్యుల జోక్యం అధికమైందన్న విమర్శలున్నాయి. పైగా సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గాలు బలంగా ఉన్నాయి. వాటికి మంత్రి ధర్మాన పెంచి పోషిస్తున్నారన్న టాక్ ఉంది. అటు నాగావళి, వంశధార నదుల్లో ఇసుక గుళ్ల చేసి దోచుకుంటున్నారన్న ఆరోపణలు తమ్మినేని కుటుంబపై ఉన్నాయి. ఇటువంటి తరుణంలో వచ్చే ఎన్నికల్లో తమ్మినేనికి టిక్కెట్ ఇస్తే ప్రతికూల ఫలితం తప్పదని సొంత పార్టీ వారే చెబుతున్నారు. మొత్తానికైతే ఉత్తరాంధ్రలో హేమాహేమీలకు వచ్చే ఎన్నికల్లో గడ్డుకాలమే.