Ongole Medical Students: వైద్యో నారాయణో హరి అంటారు. మిగిలిన విద్యతో పోలిస్తే వైద్య విద్యకు ఉండే గౌరవ, మర్యాదలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతటి మహా శక్తివంతమైన వ్యక్తి అయినా డాక్టర్ కనబడితే మొక్కుతారు. గౌరవభావం చూపుతారు. కానీ అటువంటి వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా ఆ మెడికోలు వ్యవహరిస్తున్నారు. అసాంఘిక శక్తుల వలే ప్రవర్తిస్తున్నారు.తోటి విద్యార్థులను అసౌకర్యానికి గురి చేస్తున్నారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఏడుగురు మెడికోల అరాచక వైఖరి తాజాగా బయటపడింది.
2020 బ్యాచ్ కు చెందిన ఏడుగురు విద్యార్థులు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నారు. మీరు వ్యసనాలకు బానిస అయ్యారు. ఆ మత్తులో ఇతర విద్యార్థుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారు. వివిధ జిల్లాలకు చెందిన ఈ ఏడుగురు విద్యార్థులపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల తీవ్రం కావడంతో వారి వ్యవహారం బయటకు వచ్చింది.
హాస్టల్లో గంజాయి, మద్యం తాగడం.. తోటి విద్యార్థులపై చేయి చేసుకోవడం.. అర్ధరాత్రి తగాదాలు చోటు చేసుకోవడంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. హాస్టల్ అంటేనే విద్యార్థులు భయపడిపోతున్నారు.
గతంలో ఈ ఏడుగురు విద్యార్థులు సస్పెన్షన్కు గురయ్యారు. వారిని సస్పెండ్ చేసిన ప్రిన్సిపల్ బదిలీ అయ్యారు. రెగ్యులర్ ప్రిన్సిపల్ వచ్చేసరికి సమయం పట్టింది. ఇంతలో ఆ ఏడుగురు విద్యార్థులు హాస్టల్ లోకి ప్రవేశించారు. దీంతో మళ్లీ రచ్చ ప్రారంభమైంది. గతంలో తమపై ఫిర్యాదు చేసిన వారిపై చేయి చేసుకోవడం.. ఇబ్బందులకు గురిచేస్తుండడంతో బాధితులు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. స్థానిక మీడియా ప్రతినిధులకు సమాచారం అందించారు. దీంతో మరోసారి ఆ ఏడుగురు విద్యార్థుల వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.