Homeఆంధ్రప్రదేశ్‌TDP- BJP: టిడిపి తో బిజెపి దూరంగా ఉండడానికి కారణం అదే..?

TDP- BJP: టిడిపి తో బిజెపి దూరంగా ఉండడానికి కారణం అదే..?

AP TDP- BJP
modi, chandrababu

AP TDP- BJP: భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉవ్విళ్లరుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడును దగ్గరకు కూడా రానీయడం లేదు బిజెపి. దీనికి అనేక అంశాలు కారణంగా చెబుతున్నారు నిపుణులు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం బిజెపితో కలిసి వెళ్లేందుకు తన ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు.

ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలో బలమైన శక్తిగా ఆవిర్భవించిన జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు టిడిపి ఒకవైపు ప్రయత్నాలు సాగిస్తూనే.. మరోవైపు బిజెపికి దగ్గర కావాలని ప్రయత్నిస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలను బిజెపి మాత్రం తిప్పికొడుతోంది. తమ దగ్గరకు కూడా తెలుగుదేశం పార్టీని రానీయకూడదన్న ఉద్దేశంతో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బిజెపికి బలం తక్కువగా ఉన్నప్పటికీ, కొద్దిరోజుల కిందట జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ.. బిజెపితో కలిసి వెళ్లాలన్న ప్రయత్నాలను మాత్రం చంద్రబాబునాయుడు ఆపడం లేదు.

బిజెపి చెలిమి కోసం అందుకే ప్రయత్నం..

రాష్ట్రంలో బిజెపికి బలమైన ఓటు బ్యాంకు లేకపోయినప్పటికీ.. ఏపీలో అధికారంలోకి రావాలంటే బీజేపీ సహకారం తప్పనిసరిగా ఉండాలన్నది చంద్రబాబు నాయుడు వ్యూహంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వైఎస్సార్సీపీని ఢీకొట్టాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సహకారం అవసరమన్నది చంద్రబాబు నాయుడు భావన. ఈ పార్టీకి ఉన్న కొద్దో, గొప్ప ఓటు బ్యాంకు కూడా టిడిపికి కలిసి వస్తుందని చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. బిజెపితో రాష్ట్రంలో పెట్టుకునే పొత్తు.. 2024 ఎన్నికల్లో విజయానికి పాస్ పోర్ట్ గా టిడిపి భావిస్తోంది.

ఆ విషయాలను మర్చిపోలేక పోతున్న బిజెపి..

2014 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న బిజెపి – టిడిపి – జనసేన ఉమ్మడి కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని స్థాపించింది. అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు చంద్రబాబు నాయుడు బిజెపికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అదే సమయంలో 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అమిత్ షా తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు.. టిడిపి కార్యకర్తలతో కార్లపై దాడులు చేయించాడు చంద్రబాబు నాయుడు. అలాగే కేంద్ర స్థాయిలోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ బిజెపి వ్యతిరేక శక్తులతో చంద్రబాబు నాయుడు కలిసి ప్రయాణం సాగించారు. ముఖ్యంగా కేంద్రంలో బిజెపి ఓటమికి తీవ్రంగా కృషి చేశారు. ఆ ప్రయత్నాలు ఏవీ సఫలం కాకపోవడంతో చంద్రబాబు నాయుడు సైలెంట్ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారాన్ని పోగొట్టుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు చేసిన వ్యవహారాలను బిజెపి అగ్ర నాయకులు మర్చిపోలేకపోతున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు పొత్తు కోసం వెంపర్లాడుతున్న బిజెపి అగ్రనాయకత్వం అందుకు అంగీకరించడం లేదు. చంద్రబాబు నాయుడు చేసిన గత వ్యవహారాలను సీరియస్ గా తీసుకున్న బిజేపి అగ్ర నాయకులు ఇప్పటికిప్పుడు చంద్రబాబును క్షమించేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.

TDP- BJP
TDP- BJP

తెలంగాణలో దూరంగా.. ఏపీలో దగ్గరగా..

ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలోనూ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో యాక్టివ్ చేశారు. ఏపీలో బిజెపికి దగ్గర ఎందుకు ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీ.. తెలంగాణలో మాత్రం కనీసం బీజేపీతో కలిసి వెళ్లేందుకు ప్రయత్నాలు సాగించకపోవడం గమనార్హం. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేయించింది. ఈ విషయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కనీసం బిజెపికి సహకారాన్ని అందించడం లేదు. బహిరంగంగా ఈ విషయంపై స్పందించేందుకు కూడా టిడిపి ఇష్టపడలేదు. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అక్రమంగా అరెస్టు చేసినప్పటికీ స్పందించని తెలుగుదేశం పార్టీ.. ఏపీలో మాత్రం బిజెపి సహాయాన్ని ఎలా కోరుతుందన్న భావన బిజెపి అగ్ర నాయకుల్లో వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఓటుకు నోటు వ్యవహారంలో భయంతో..

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని యాక్టివ్ చేసిన చంద్రబాబు నాయుడు.. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పట్ల భయంతోనే వ్యవహరిస్తున్నారు. బిఆర్ఎస్ పార్టీకి, కెసిఆర్ కు వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు ఎటువంటి చర్యలకు పాల్పడిన.. ఓటుకు నోటు కేసును రీ ఓపెన్ చేస్తారన్న భయం చంద్రబాబు నాయుడు లో ఉందన్న విషయం అందరిలోనూ వ్యక్తం అవుతుంది. తెలంగాణలో జరుగుతున్న వ్యవహారాలపై కనీసం నోరు మెదపని టిడిపిని బిజెపి ఎందుకు విశ్వసిస్తుందన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తం అవుతోంది. తెలంగాణలో ప్రతిపక్షంగా పోరాటం సాగిస్తున్న బిజెపికి అండగా నిలవని టిడిపికి.. ఏపీలో ఎందుకు సహకారాన్ని అందించాలన్న భావన బిజెపి అగ్ర నాయకుల్లో ఉంది. ఆ ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్లో టిడిపితో చేతులు కలిపేందుకు బిజెపి అంగీకరించడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Exit mobile version