
KCR On Vizag Steel: “విశాఖ స్టీల్ కు సంబంధించి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ విషయంలో సింగరేణి ద్వారా ముందుకు వెళుతున్న కేసీఆర్.. మంగళవారం విశాఖ స్టీల్ కర్మగారాన్ని సందర్శించనున్న సింగరేణి అధికారులు” ఇది నిన్నటి నుంచి మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త.. ఇక నమస్తే తెలంగాణ అయితే ” ఆ మోదీ అసలు మంచోడు కాదు. పరిశ్రమలను అమ్మేస్తున్నాడు.. మా చంద్రశేఖర్ రావు అయితే చాలా మంచోడు. అన్నింటినీ కొంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ ను కాపాడుతున్నాడు. వైజాగ్ స్టీల్ కార్మికులను కడుపులో పెట్టి చూసుకుంటున్నాడు. ఇది కేసీఆర్ కు, మోదీకి ఉన్న తేడా” ఈ రేంజ్ లో రాస్కొచ్చింది..సరే ఇప్పుడు కెసిఆర్ జాతీయస్థాయిలో చక్రాలు తిప్పాలి కనుక, మోదీని అర్జెంటుగా గద్దె దింపాలి గనుక ఈ టైప్ డప్పు “నమస్తే” కొడుతూనే ఉంటుంది. ఆఫ్ కోర్స్ అది ఉన్నదే అందుకు. వైజాగ్ స్టీల్ గురించి రాస్తున్న పత్రికలన్నీ తెలంగాణలో ఖాయిలపడ్డ ప్రశ్నల గురించి కూడా ప్రపంచానికి చెబితే బాగుండు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మూతపడిన పరిశ్రమలను మొత్తం తెరిపిస్తానని నాడు కెసిఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇవాల్టి వరకు ఒక పరిశ్రమను కూడా తెరిపించలేకపోయారు.. ఫలితంగా లక్షలాది మంది కార్మికులు నేటికీ ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. సొంత రాష్ట్రంలో పరిశ్రమలను తెరిపించే సత్తా లేదు కాని.. పొరుగున ఉన్న పరిశ్రమను కాపాడేందుకు వెళ్తున్నాడని ప్రతిపక్షాలు కేసీఆర్ ను ఉద్దేశించి ఆరోపిస్తున్నాయి.
తెలంగాణలో నిజాం షుగర్స్, అజం జాహి మిల్స్, ప్రాగా టూల్స్, ఆల్విన్, హెచ్ఎం టీ, హెచ్ సీ ఎల్, ఐడీపీఎల్.. ఇలా ఎన్నో పరిశ్రమలు ఖాయిలా పడటంతో ఎందరో కార్మికులు రోడ్డున పడ్డారు. తెలంగాణ ఏర్పడే సమయానికి సుమారు 1600 వరకు మధ్యతరహా కంపెనీలు, 3000 వరకు చిన్న తరహా కంపెనీలు మూతపడ్డాయి. రాష్ట్రం ఏర్పడిన ఈ తొమ్మిది సంవత్సరాలలో దాదాపు 15వేల చిన్న ,మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. ముఖ్యంగా కోవిడ్ సమయాల్లో సర్కార్ నుంచి సాయం లేక, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేక పారిశ్రామికవేత్తలు వీటికి తాళం వేశారు. 15వేల పరిశ్రమల వల్ల సుమారు ఐదు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.
అప్పటి ఉమ్మడి పాలకుల హయాంలో ప్రాగా టూల్స్, ఆల్విన్ కంపెనీ, హెచ్ఎంటి, ఐడిపీఎల్ లాంటి కంపెనీలను పునరుద్ధరించాలని తాము భావిస్తున్నామని, వీటితోపాటు నిజాం షుగర్స్, అజాంజాహి మిల్లును కూడా తెరిపిస్తామని అప్పట్లో భారత రాష్ట్ర సమితి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఉద్యమ సమయంలో, తర్వాత వీటి గురించే ప్రస్తావించింది. తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోపు నిజాం షుగర్ పై నిర్ణయం తీసుకుంటామని బోధన్ వేదికగా అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పక్కన పడేశారు. ఆయా కంపెనీల కమిటీలు జేఏసీలుగా ఏర్పడి ఉద్యమాలు చేసినా, సర్కార్కు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోతోంది. సిర్పూర్ కాగజ్నగర్ పేపర్ మిల్లును తప్ప ఏ ఒక్కదాన్ని కూడా ప్రభుత్వం తిరిగి తెరిపించలేదు.

మూతపడిన పెద్ద కంపెనీలు, ఫ్యాక్టరీలను తెరిపిస్తే పరోక్షంగా లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. కార్మికులకు ఉపాధి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ షుగర్స్ లాంటి కర్మాగారాన్ని తెరిపిస్తే రైతులు ఎక్కడికో వెళ్లి చెరుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండదు. షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోకపోవడంతో ప్రతి సీజన్లో రైతులు గోసపడుతున్నారు. ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకునేందుకు సరిహద్దుల్లోని రాష్ట్రాలకు వెళ్తున్నారు.
నిజాంబాద్ జిల్లా బోధనలోని నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ 1936లో ప్రారంభమైంది. దీంతోపాటు మెట్ పల్లి సమీపంలోని ముత్యంపేట, మెదక్ సమీపంలోని ముంబోజి పల్లి నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ యూనిట్లు ఏర్పడ్డాయి. 2002 దాకా ఇవి ప్రభుత్వ రంగంలో నడిచాయి. వీటిలో 2000 మంది కార్మికులు పనిచేసేవారు. టిడిపి హయంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేట్ కి ఇచ్చారు. ఆ తర్వాత బోధన్, ముత్యంపేట, మంబోజి పల్లిలోని ఫ్యాక్టరీలు మూతపడ్డాయి.
ఆజంజాహీ మిల్లు
వరంగల్ లో 1934లో 202 ఎకరాల స్థలంలో ఆజంజాహీ మిల్లును స్థాపించారు. ఇక్కడ తయారయ్యే దుస్తులు విదేశాలకు ఎగుమతి అయ్యేది. సైనికుల డ్రెస్ మెటీరియల్ కూడా ఈ మిల్లు ఉత్పత్తి చేసేది. వరంగల్ నగరానికి అంతటికి స్ట్రీట్ లైట్స్ కు కావలసిన కరెంటు సహఫరా చేసిన ఘనత కూడా ఈ మిల్లుకు ఉంది. ఇందులో సొంతంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉండేది. సుమారు పదివేల మందికి పైగా ఉపాధి పొందేవారు. నిజాం కాలంలో లాభాలతో నడిచిన మిల్లు.. ఉమ్మడి రాష్ట్ర పాలనలో నష్టాల బాట పట్టింది. 1990లో ఇది మూత పడింది. మిల్లు ఓపెన్ చేయాలని ఎన్ని ఉద్యమాలు చేసినా ఫలితం దగడం పోయింది. దీంతో అనేకమంది పొట్ట కూటి కోసం వలస వెళ్లిపోయారు.
డిబీఆర్ మిల్స్
తెలంగాణ చెందిన మరో ప్రతిష్టాత్మకమైన సంస్థ డీబీఆర్ మిల్స్. 1922లో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమైంది. లోయర్ ట్యాంక్ బండ్ మీద ఈ ఫ్యాక్టరీ ఉండేది. ఇందులో 1000 మంది వరకు పనిచేసేవారు. 1984లో దీన్ని లీజుకు ఇచ్చారు. 1992లో ఫిబ్రవరిలో ఫ్యాక్టరీకి తాళం వేశారు. అప్పట్లోనే కోట్ల విలువైన మిషనరినీ రాత్రికి రాత్రే తరలించుకుపోయారని ప్రచారంలో ఉంది.
ఆల్విన్ కంపెనీ
1942లో అప్పటి నిజాం పాలనలోని నిజాం పారిశ్రామిక అభివృద్ధి ట్రస్ట్, అల్లావుద్దీన్ అండ్ కంపెనీ సహకారంతో హైదరాబాదులో ఆల్విన్ మెటల్ ఇండస్ట్రీస్ ప్రారంభమైంది. ఇందులో 15000 మంది పనిచేసేవారు. 1952 లో దేశ తొలి సార్వత్రిక ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు తయారుచేసిన ఘనత ఈ కంపెనీదే. ఆర్టీసీకి డబుల్ డెక్కర్ బస్సులను కూడా ఆల్విన్ కంపెనీయే తయారు చేసింది. 1981లో జపాన్ సహకారంతో సికో కంపెనీతో కలిసి గడియారాల తయారీ కూడా ప్రారంభించారు. 1994లో ఈ కంపెనీ మూత పడింది.
ఐడీపీఎల్
హైదరాబాద్ బాలానగర్లో 1961లో ఐడీపీఎల్ కంపెనీని నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు. ఇందులో 3700 మంది పనిచేసేవాళ్ళు. 47 రకాల ఔషధలను ఇక్కడ తయారు చేసేవాళ్ళు. 1996 నుంచి బల్క్ డ్రగ్, 2003 నుంచి ఫార్ములేషన్ల తయారీ నిలిపివేశారు.
ప్రాగా టూల్స్
1943 మే నెలలో సికింద్రాబాద్లోని కవాడిగూడ ప్రాంతంలో ప్రాగా టూల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రారంభమైంది. ఇందులో పరిశ్రమలకు సంబంధించిన టూల్స్ తయారు చేసే వాళ్ళు. 1963 లో ఈ పరిశ్రమ పేరును ప్రాగా టూల్స్ లిమిటెడ్ గా మార్చారు.. తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. తర్వాత దీన్ని మూసేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి. వీటిని తెరిపించే సాహసం కేసీఆర్ చేయడం లేదు కానీ.. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ స్టీల్ ను ఆదుకోవడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సింగరేణికి అంత ఆర్థిక దన్ను ఉంటే ఈ కంపెనీలను ఆదుకుంటే ఎంతో మందికి ఉపాధి లభిస్తుందనే ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో ఉంది.. కేవలం రాజకీయాల కోసమే ఆంధ్ర ప్రదేశ్ లోని వైజాగ్ స్టీల్ ను కాపాడేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.