Cheating Marriage: భర్తకు భార్యలే దగ్గరుండి పెళ్లి చేయిస్తున్న ఘటనలు ఇటీవల జరుగుతున్నాయి. వివిధ కారణాలతో భర్తలు భార్యలను ఒప్పించి వారి సమక్షంలోనే రెండో పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. ఇటీవలే ఓ వ్యక్తిని పెళ్లాడిన యువతి పెనిమిటి కోరుకున్నాడని మరో యువతితో దగ్గరుండి పెళ్లి చేయించింది. ఘటన బంజారాహిల్స్ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. ఎస్సై రవీందర్ కథనం ప్రకారం..
డ్యాన్స్ అకాడమీలో…
బంజారాహిల్స్‌లోని సింగాడి కుంట బస్తీకి చెందిన ఓ యువతి(20) హోం ట్యూటర్‌గా పనిచేస్తుంది. 2020లో యూసుఫ్‌గూడలోని ఓ డ్యాన్స్ అకాడమీలో శిక్షణ తీసుకొనేందుకు వెళ్లిన సమయంలో అక్కడ గాంధీ(23) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరువర్గాల పెద్దలు అంగీకరించి నిశ్చితార్థం చేయడంతో సహజీవనం చేస్తున్నారు. గాంధీకి రోజా అనే యువతితో సంబంధం ఉందని యువతి అనుమానించడం, ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు రావడంతో గొడవలు పడి పోలీసులు వరకు వెళ్లారు. రోజా, గాంధీ ఇద్దరు తాము మంచి స్నేహితులమని నమ్మించడంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. మే 14న వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దల సమక్షంలో రోజా దగ్గరుండి అన్ని బాధ్యతలను తీసుకొని వివాహం చేయించింది.
ఇంటికి ఆలస్యంగా రావడంతో..
పెళ్లైన కొన్నాళ్ల వరకు సంతోషంగానే ఉన్నా, కొద్ది రోజుల తర్వాత గాంధీ ఇంటికి ఆలస్యంగా రావడం, ప్రశ్నిస్తే కొట్టడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే గాంధీ, రోజా ఇద్దరు తమ పెళ్లికి కొద్ది రోజుల ముందే పెళ్లి చేసుకున్నారని తెలుసుకొంది. యువతి మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లో ఉండగా రోజా తన మద్దతుదారులైన సుజ్జి, సంజీవ్, విజయ్, అనంత, జెస్సికాలతో వచ్చి తనకూ న్యాయం చేయాలంటూ గొడవకు దిగింది. ఈ మేరకు యువతి మంగళవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు గాంధీ, రోజాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.