Teenmar Mallanna- Chandrababu: తెలంగాణలో తనకు పట్టు ఉందని నిరూపుంచుకోవడం ద్వారా ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటుంది. టీడీపీ ఈమేరకు ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇటీవల ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించారు. భారీగా జన సమీకరణ చేశారు. ఇక్కడ బీజేపీకి మద్దతు తెలిపి ఆంధ్రాలో జగన్‌ను ఓడించేందుకు బీజేపీ మద్దతు తీసుకోవాలని భావించారు. కానీ ఆయన వ్యూహం బెడిసికొట్టింది. టీడీపీతో పొత్తుకు బీజేపీ సుముఖంగా లేదు. దీంతో భవిష్యత్‌లో అయినా తన అవసరం పడకపోతుందా అన్న ఆలోచన టీడీపీ అధినేత చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పార్టీకి ఇంకా క్యాడర్ ఉన్నందున వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈమేరకు క్రీయాశీకలంగా పార్టీని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశర్ ముదిరాజ్‌ను నియమించడం ద్వారా పార్టీని పునరుద్ధరించిన బాబు రాష్ట్రంలో పార్టీ ఉనికిని నిరూపించేందుకు డిసెంబర్‌లో ఖమ్మంలో జరిగిన భారీ ర్యాలీలో కూడా ప్రసంగించారు.

పొత్తు కోసం..
తెలంగాణలో టీడీపీకి ఇంకా సొంత ఓటు బ్యాంకు ఉందని నిరూపించుకోవాలని బాబు ప్రయత్నిస్తున్నారు. ఇది బీజేపీకి ఎన్నిల తర్వాత అయినా స్నేహ హస్తం అందించేందుకు దోహదపడుతుందని అంటున్నారు. తెలంగాణలో బీజేపీ సహాయం చేయడం ద్వారా, క్విడ్ ప్రోకో వ్యూహంలో భాగంగా ఆంధ్రాలో బీజేపీ మద్దతును బాబు కోరుతున్నారు. అయితే, బీజేపీ స్పందించడం లేదు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు.
ప్రత్యామ్నాక కూటమి కోసం..
తెలంగాణలో బాబు వ్యూహం బెడిసి కొట్టడంతో ప్రత్యామ్నాయ కూటమి భాగస్వాముల కోసం వెతుకుతున్నారు. ఈ ప్రయత్నంలో క్యూ న్యూస్ వ్యవస్థాపకుడు, గతంలో కాంగ్రెస్, బీజేపీలో పనిచేసిన తీన్మార్ మల్లన్న ఆశాదీపంలా కనిపించాడు. ఆయనతో తెలంగాణలో కలిసి పనిచేయాలని టీడీపీ భావిస్తోంది. ఈ క్రమంలో గురువారం తీన్మార్ మల్లన్నతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సుదీర్ఘంగా సమావేశమై తెలంగాణలో టీడీపీకి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. చంద్రబాబు నాయుడు కూడా మల్లన్నతో ఫోన్‌లో మాట్లాడి తెలంగాణలో టీడీపీతో కలిసి పనిచేయాలని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. మల్లన్నతో చేతులు కలపాలని, పార్టీ బలోపేతానికి ఇరువురు కలిసికట్టుగా కృషి చేయాలని జ్ఞానేశ్వర్‌ను కోరారు.

ఎక్కడా కుదురుగా ఉండని మల్లన్న..
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తీన్మార్ మల్లన్న ఎక్కడా కుదురుగా ఉండరు. గతంలో ఓ టీవీ చానల్‌లో పనిచేశారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్‌తో కలిసి పనిచేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేశారు. ఆ తర్వాత బీజేపీకి దూరమయ్యారు. ప్రస్తుతం సొంతంగానే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ ఆయనతో సంప్రదింపులు జరుపుతోంది. మరి ఇక్కడ అయినా మల్లన్న కుదురుగా ఉంటారో లేదో చూడాలి.