Taraka Ratna Health: నారా లోకేష్ యువగళం పేరిట శ్రీకారం చుట్టిన పాదయాత్రలో మొదటిరోజే అపశృతి చోటు చేసుకుంది. హీరో తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. యువగళం కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన తారకరత్నను కుప్పంలో గల ఆసుపత్రికి తరలించారు. తారకరత్న కార్డియాక్ అరెస్ట్ కి గురైనట్లు గుర్తించిన వైద్యులు పల్స్ రేటు తక్కువగా ఉందని వెల్లడించారు. అయితే వైద్యం అనంతరం ఆయన తిరిగి కోలుకుంటున్నట్లు చెప్పడంతో అభిమానుల్లో ఆందోళన తగ్గింది.

అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. గుండెకు రక్త ప్రసరణ, ఆక్సిజన్ అందక ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు తరలిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మీడియా వర్గాల సమాచారం ప్రకారం తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ బాబాయ్ బాలయ్యకు ఫోన్ చేసినట్లు సమాచారం అందుతుంది. ఫోన్లో తారకరత్న కండీషన్ గురించి ఎన్టీఆర్ వాకబు చేశారట. తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎన్టీఆర్ కి బాలయ్య వివరించినట్లు విశ్వసనీయ సమాచారం.
గ్రీన్ ఛానల్ ద్వారా అంబులెన్సులో తారకరత్నను బెంగుళూరు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. నందమూరి కుటుంబ సభ్యులు పూర్తి సమాచారం అందిన తర్వాత తారకరత్నను అడ్మిట్ చేసిన ఆసుపత్రికి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. తారకరత్న అనారోగ్యానికి గురైన నేపథ్యంలో లోకేష్ యువగళం కార్యక్రమానికి తాత్కాలిక విరామం ఏర్పడింది. ఇటీవల తారకరత్న క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. ఏపీలో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు ధృవీకరించారు.

ఇంతలోనే ఆయన అనుకొని ప్రమాదానికి గురయ్యారు. తారకరత్న 2002లో విడుదలైన ఒకటో నెంబర్ కుర్రాడు మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యాడు. నందమూరి ఫ్యామిలీ తారకరత్నను భారీగా లాంచ్ చేసింది. అరంగేట్రంతోనే తొమ్మిది సినిమాలకు తారకరత్న సైన్ చేయడం అప్పట్లో సంచలనం రేపింది. ఫస్ట్ మూవీ మినహాయిస్తే తారకరత్నకు మరో హిట్ పడలేదు. హీరోగా ఆయన ఫేడవుట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన డిజిటల్ సిరీస్లు చేస్తున్నారు.