
Tarakaratna Health: 23 రోజులుగా ఆసుపత్రి బెడ్ పై తారకరత్న చలనం లేకుండా పడి ఉన్నారు. కార్డియాక్ అరెస్ట్ తో ఆసుపత్రి పాలైన తారకరత్న కోమాలోకి వెళ్లారు. తారకరత్న హెల్త్ కండిషన్ పై ఎలాంటి అప్డేట్ లేదు. వైద్యులు, కుటుంబ సభ్యులు సైలెంట్ అయ్యారు. ఇటీవల అమిగోస్ చిత్ర ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ కూడా అస్పష్టంగా సమాచారం అందించారు. తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతుంది. అతని కండీషన్ ఏమిటనేది వైద్యులు చెబితేనే బాగుంటుంది అన్నారు.
గురువారం తారకరత్న మెదడుకు పరీక్షలు నిర్వహించారు. తల స్కాన్ చేసినట్లు సమాచారం బయటకు వచ్చింది. హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం కలదని అభిమానులు భావించారు. కానీ వైద్యుల నుండి ఎలాంటి సమాచారం రాలేదు. తారకరత్న మెదడులో సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది. తారకరత్న కార్డియాక్ అరెస్ట్ కి గురికావడంతో కొన్ని నిమిషాల పాటు గుండె పని చేయలేదు. ఆ కారణంగా మెదడుకు రక్త ప్రసరణ జరగలేదు. మెదడు పై భాగంలో కొంత మేర దెబ్బతింది.
మెదడులో సమస్య ఏర్పడడంతో తారకరత్న కోమాలో ఉండిపోయారు. విదేశీ వైద్య నిపుణులు మెదడు పనితీరు మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా నేడు తారకరత్న ఆరోగ్యం మరింత విషమించినట్లు సమాచారం అందుతుంది. దీంతో బాలయ్యతో పాటు కుటుంబ సభ్యులు బెంగుళూరు పయనమయ్యారు. ఈ పరిణామం అభిమానుల్లో మరోసారి ఆందోళన కలిగిస్తుంది. తారకరత్న కండీషన్ మీద అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో సమాచారం ఇస్తే బాగుంటుందన్న వాదన వినిపిస్తోంది.

నారా లోకేష్ జనవరి 27న కుప్పం వేదికగా యువగళం పాదయాత్ర ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి బాలకృష్ణతో పాటు తారకరత్న హాజరయ్యారు. పాదయాత్ర మొదలైన కాసేపటికే తారకరత్న కుప్పకూలిపోయారు. స్థానిక ఆసుపత్రికి ఆయన్ని తరలించడం జరిగింది. తారకరత్నకు కార్డియాక్ అరెస్ట్ అని గుర్తించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. అక్కడే కొన్ని రోజులుగా తారకరత్నకు వైద్యం జరుగుతుంది.