
Tarakaratna Health Update: తారకరత్న ఆసుపత్రిలో చేరి మూడు వారాలు కావస్తుంది. మొదటి వారం రోజులు ఆసుపత్రి వర్గాలు, కుటుంబ సభ్యులు హడావుడి చేశారు. వారం రోజులుగా అందరూ సైలెంట్ అయ్యారు. అత్యంత విషమ పరిస్థితిలో ఉన్న పేషేంట్ హెల్త్ పై ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అసహనానికి గురవుతున్నారు. అమిగోస్ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ మీడియా ముందుకు వచ్చారు. ఆయన కూడా స్పష్టమైన సమాచారం ఇచ్చారు. తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతుంది. హెల్త్ కండిషన్ ఏమిటనేది డాక్టర్స్ చెబితే బాగుంటుంది… అంటూ మరింత సస్పెన్స్ లోకి నెట్టారు.
అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం బయటకు వచ్చింది. తారకరత్న ప్రధాన అవయవాల తీరు మెరుగైంది. గుండె, లివర్, కిడ్నీలు సాధారణ స్థితికి వచ్చాయి. అయితే మెదడులో నెలకొన్న సమస్య అలానే ఉంది. అందుకునే ఆయన స్పృహలోకి రావడం లేదు. మెదడును మెరుగుపరిచేందుకు న్యూరాలజిస్ట్స్ నిరంతరం శ్రమిస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలిస్తే త్వరలోనే తారకరత్న స్పృహలోకి వస్తారని అంటున్నారు. ఒక్కసారి తారకరత్న కోమా నుండి బయటకు వస్తే ఆయన ప్రమాదం నుండి బయటపడ్డట్లే.
మెదడుకు వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారట. మంగళవారం లేదా బుధవారం తారకరత్న హెల్త్ బులెటిన్ ఆసుపత్రి వర్గాలు విడుదల చేయనున్నాయట. ప్రస్తుతానికి తారకరత్న గురించి అందుతున్న సమాచారం ఇది. కార్డియాక్ అరెస్ట్ కి గురయ్యాక తారకరత్న గుండె 45 నిమిషాలు పనిచేయలేదని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలో ప్రధాన అవయవాలతో పాటు మెదడుకు రక్త ప్రసరణ జరగలేదు.

శరీరంలో అతి సున్నితమైన అవయవాల్లో ఒకటైన మెదడుకు ఆక్సిజన్, రక్తప్రసరణ జరగకపోతే… త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది. తారకరత్న మెదడుకు నిమిషాల పాటు రక్త ప్రసరణ లేకపోవడం వలన పైభాగం దెబ్బతింది. అక్కడ వాపు ఏర్పడి నీరు చేరినట్లు గతంలో వైద్యులు వెల్లడించారు. దీని కోసమే తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లాలని భావించారు. ఆ ఆలోచన మానుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో రెండు రోజుల్లో తారకరత్న ఆరోగ్యం పై స్పష్టత రానుంది.