
Suresh Babu- Rana: ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఆయన కుమారుడు రానా వివాదంలో చిక్కుకున్నారు. ఓ స్థలం అమ్మకం గొడవకు దారి తీసింది. దీంతో రానా,సురేష్ బాబు మీద కేసు బుక్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఫిల్మ్ నగర్ కో ఆపరేటివ్ సొసైటీ లోని ఓ స్థలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. 1007 గజాల స్థలం అమ్మకానికి పెట్టారు. ఈ స్థలం సేల్ కి సంబంధించి అగ్రిమెంట్ నడుస్తుట్లు సమాచారం. కొందరు భాగస్వాములుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అమ్మకం విషయంలో ముందుగా చేసుకున్న ఒప్పందాన్ని సురేష్ బాబు అతిక్రమించారని బంజారా హిల్స్ కి చెందిన వ్యాపారి ప్రమోద్ కుమార్ కోర్టును ఆశ్రయించారు.
ప్రమోద్ కుమార్ పిటిషన్ ఆధారంగా దగ్గుబాటి రానా, సురేష్ బాబుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. మొదట ప్రమోద్ కుమార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోలేదట. అలాగే సురేష్ బాబు, రానా రౌడీలతో బెదిరించారని ప్రమోద్ కుమార్ ప్రధాన ఆరోపణ. పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో కోర్ట్ ని ఆశ్రయించాల్సి వచ్చిందని ప్రమోద్ కుమార్ తెలియజేశారు.
సురేష్ బాబు, రానాల మీద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ భూవివాదంపై సురేష్ బాబు ఎలాంటి వివరణ ఇస్తారో అని టాలీవుడ్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. రామానాయుడు మరణం అనంతరం సురేష్ ప్రొడక్షన్స్ వైభవం తగ్గిందని చెప్పొచ్చు. నిర్మాత సురేష్ బాబు సేఫ్ గేమ్ ఆడుతూ నిర్మాణం తగ్గించేశారు. సహా నిర్మాతగా ఉండటం లేదా తెరకెక్కించిన సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదల చేయడం చేస్తున్నారు. నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోని కూల్చి వ్యాపార, నివాస సముదాయాలుగా మార్చేస్తున్నారు.

50 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ వెలుగు కోల్పోతుంది. ఇక రానా కూడా సినిమాలు తగ్గించేశారు. ఆయన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఆ మధ్య అమెరికాలో లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. రానా చివరి చిత్రం విరాటపర్వం అంతగా ఆడలేదు. త్వరలో ఆయన రానా నాయుడు వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. వెంకటేష్-రానా కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది.
