
MLC Kavitha- Supreme Court: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. ఈ కుంభకోణంలో ఈడి తనకు నోటీసులు జారీ చేయడాన్ని కవిత సవాల్ చేస్తూ ఈనెల 23న పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ తనపై తదుపరి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ తనకు పిఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం జారీ చేసిన నోటీసులు, సి ఆర్ పి సి సెక్షన్ 160 కి విరుద్ధంగా ఉన్నాయని, వాంగ్మూలం నమోదు చేసేటప్పుడు న్యాయవాది సమక్షంలో వీడియో చిత్రీకరణకు ఉత్తర్వులు జారీ చేయాలని కవిత ఆ పిటిషన్ లో కోరారు.
తన ఫోన్ స్వాధీనం చేసుకొని, జారీ చేసిన జప్తు నోటీసులను రద్దు చేయడంతో పాటు, ఫోన్ సీజ్ చేయడం చెల్లదని ఆదేశాలు ఇవ్వాలని, ఈ పిటిషన్ ను నళీని చిదంబరం వర్సెస్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసుకు జత చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు..ఈ పిటిషన్ ను జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం. త్రివేది ల ధర్మాసనం విచారణకు స్వీకరించింది.. తొలుత కవిత పిటిషన్ పై శుక్రవారం విచారణ జరుపుతామని చెప్పినా.. ఆ తదుపరి విచారణను 27వ తేదీకి సుప్రీంకోర్టు మార్చింది. ఇక లిక్కర్ స్కాంలో కవిత తన వాంగ్మూలాన్ని ఈడీ ఎదుట మూడుసార్లు ఇచ్చారు..

మరోవైపు కవిత విచారణ సోమవారం జరగనున్న నేపథ్యంలో ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కీలకమైన న్యాయవాదులు ఈ కేసును విచారిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందోనని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ సుప్రీంకోర్టు కవితకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఏం చేయాలి అనే దానిపై భారత రాష్ట్ర సమితి తీవ్ర మల్ల గుల్లాలు పడుతోంది. ఇక ఈ కేసు విచారణ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి లీగల్ విభాగానికి చెందిన సోమ భరత్ కుమార్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కంటే మంది సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా ఈ పిటిషన్ కు సంబంధించి ఇప్పటికే ఈడి కెవియట్ దాఖలు చేసింది. అంతేకాదు ఈ లిక్కర్ స్కాంలో మరింత లోతుగా దర్యాప్తు చేయాలని, అందుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును ఈడి కోరింది. మరి ఈ కేసు దృష్ట్యా సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా ఇప్పటికే సుప్రీంకోర్టు కవిత పిటిషన్ కు సంబంధించి విచారణ విషయంలో రెండు సార్లు తోసిపుచ్చడంతో గులాబీ పార్టీలోనూ టెన్షన్ నెలకొంది.