Superstar Krishna Health Bulletin: సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో వెంటనే ఎమర్జెన్సీకి తరలించి చికిత్స చేస్తున్నామన్నారు. రేపు మధ్యాహ్నం మరోసారి మీడియాకు బులిటెన్ విడుదల చేస్తామని ప్రకటించారు. సోమవారం ఉదయం ఇంట్లో ఉన్న కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. అయితే శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిపారు. కృష్ణ ఆస్పత్రిలో చేరిన విషయం తెలియగానే ఆయన కుమారుడు స్టార్ హీరో మహేశ్ వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. ఇక కృష్ణకు ప్రాథమికంగా చికిత్స చేసి ఆ తరువాత ఐసీయూ కి తరలించిన తరువాత వైద్యులు మీడియాతో మాట్లాడారు.

‘సోమవారం ఉదయం 2 గంటల ప్రాంతంలో కృష్ణ ను ఆసుపత్రికి తీసుకొచ్చారు. కార్డియాక్ అరెస్ట్ పరిస్థితి ఉండటంతో వెంటనే ఆయనను ఎమర్జెన్సీకి తరలించి సీపీఆర్ చేశాం. 20 నిమిషాల సీపీఆర్ తరువాత కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం కృష్ణ ను ఐసీయూ కి తరలించాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. అయితే 48 గంటలు గడిస్తే గానీ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తిగా చెప్పలేం’ అని వైద్యులు తెలిపారు.

అంటే ఓవరాల్ గా ప్రస్తుతానికి నిలకడగానే ఉన్న కృష్ణ ఆరోగ్యం టైం గడిస్తే గానీ చెప్పలేమన్నారు. అయితే కృష్ణ ఆసుపత్రిలో చేరడం తో సినీ ప్రముఖులు, అభిమానులు ఆసుపత్రికి తరలివస్తున్నారు. ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కొందరు సోషల్ మీడియా వేదికగా కృష్ణకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా సీనియర్ నటుడు నరేశ్ తో పాటు కృష్ణ కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. అక్కడికి వచ్చిన వారంతా మహేశ్ తో పాటు కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు.