Superstar Krishna: సీనియర్ స్టార్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. సోమవారం తన నివాసంలో అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు. ఇటీవల కృష్ణ పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అంతేకాకుండా ఆయన భార్య, మహేష్ తల్లి ఇందిర మరణించిన సమయంలో కృష్ణ యాక్టివ్ గానే ఉన్నారు.

అయితే వాతావరణంలో మార్పులతో ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆసుపత్రి నుంచి కృష్ణకు సంబంధించిన ఆరోగ్య సమాచారం వైద్యులు ప్రకటించాల్సి ఉంది. సీనియర్ నటుడు అయిన కృష్ణ అస్వస్థతకు గురైన సంఘటనలు తక్కువ.దాదాపు మూడు దశాబ్దాల పాటు కృష్ణ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. నాటి నుంచి నేటి వరకు హీరోగానే కాకుండా పలు పాత్రల్లో నటించారు. కొన్ని సంవత్సరాలుగా సినిమాల్లో కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో ఆయన ఫొటోలు కనిపిస్తున్నాయి.

ఇటీవల ప్రముఖ కమెడియన్ ఆలీ కృష్ణను కలిశారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే ఇతర ఫంక్షన్లలోనూ కృష్ణ హజరవుతూ ఉంటారు. ముఖ్యంగా మహేశ్ బాబు పుట్టిన రోజు వేడుకలను కృష్ణ ఇంట్లోనే జరుపుకుంటారు. ఈ వేడుకకు మహేశ్ ఫ్యామిలీ మొత్తం ఒక్కచోటుకు చేరుతుంది. కృష్ణకు అస్వస్థత అని తెలియగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఆయనను పరామర్శించేందుకు కొంతమంది కాంటినెంటల్ కు చేరుతున్నారు.