
SRH Vs MI IPL 2023: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో హైదరాబాద్ జట్టు ఘోరంగా విఫలమవుతోంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ ల్లో మూడు మ్యాచ్ ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ జట్టుకు సొంత మైదానం కూడా కలిసి రావడం లేదు. హైదరాబాదులో ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండు మ్యాచ్ ల్లో ఓటమి పాలు కావడం గమనార్హం.
ఐపీఎల్ 16వ ఎడిషన్ లో హైదరాబాద్ జట్టుకు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ ల్లో మూడింట ఓటమిపాలై.. పాయింట్లు పట్టికలో చివరి నుంచి రెండో స్థానానికి పడిపోయింది హైదరాబాద్ జట్టు. వరుసగా రెండు విజయాలు నమోదు చేసుకుని గాడిలో పడినట్టు కనిపించినా.. హైదరాబాదులో మంగళవారం ముంబై తో జరిగిన మ్యాచ్ లో మళ్లీ తడబాటుకు గురైంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బలమైన భాగస్వామ్యాలు నమోదు కాకపోవడంతో ఓటమి తప్పలేదు. ఇకపోతే సొంత గ్రౌండ్లో వరుసగా రెండో ఓటమిని మూట గట్టుకుంది హైదరాబాద్ జట్టు.
మూడు మ్యాచ్ ల్లో రెండు ఓటములు..
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు ఓడిపోయిన మూడు మ్యాచ్ ల్లో రెండు సొంత గడ్డ మీదే కావడం గమనార్హం. మొదటి మ్యాచ్ లో రాజస్తాన్ జట్టుతో ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు 203 పరుగులు చేయగా, భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదారాబాద్ జట్టు ఘోరంగా విఫలమై 131 పరుగులకే పరిమితమైంది. 72 పరుగులు తేడాతో రాజస్థాన్ జట్టు ఘన విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన పంజాబ్ తో మ్యాచ్ లో సొంత మైదానంలో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 9 వికెట్లు నష్టపోయి 143 పరుగులు చేయగా, స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 17.1 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 145 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రాహుల్ త్రిపాఠి 74 పరుగులు చేయగా, మర్క్రమ్ 37 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. తాజాగా ఇదే స్టేడియంలో జరిగిన ముంబైతో మ్యాచ్ లో 14 పరుగులు తేడాతో హైదరాబాద్ జట్టు ఓటమి పాలైంది. మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 5 వికెట్లు నష్టపోయి 192 పరుగులు చేయగా, భారీ లక్ష్యంతో చేజింగ్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టుకు శుభారంభం దక్కలేదు. ముందు మ్యాచ్ లో సెంచరీతో కదం తొక్కిన బ్రూక్ ఈ మ్యాచ్ లో విఫలమయ్యాడు. 11 పరుగులకు మొదటి వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది హైదరాబాద్ జట్టు. 25 పరుగుల వద్ద రాహుల్ త్రిపాఠి వికెట్ నష్టపోవడంతో భారీ తేడాతో ఓటమి ఫాలవుతుందని భావించారు. మయాంక్ అగర్వాల్ 41 బంతుల్లో 48 పరుగులు చేయగా, క్లాసెన్ 16 వంతుల్లో 36 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో 14 పరుగులు తేడాతో హైదరాబాద్ జట్టు సొంత మైదానంలో మరో ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.

కలిసిరాని సొంత గ్రౌండ్ సెంటిమెంట్..
సాధారణంగా ఏ జట్టు అయిన సొంత మైదానంలో బలంగా కనిపిస్తుంది. ఐపీఎల్ ఆడుతున్న ప్రతి జట్టు ఇంచుమించుగా సొంత మైదానంలో మెరుగైన విజయాలను నమోదు చేస్తున్నాయి. గత సీజన్లలో సొంత మైదానంలో హైదరాబాద్ జట్టు బలంగానే ఉండేది. ఇక్కడ భారీగానే విజయాలు నమోదు చేసుకుంది. ఈ సీజన్ మాత్రం హోమ్ గ్రౌండ్ జట్టుకు కలిసి రావడం లేదు. మూడు మ్యాచ్ ల్లో రెండు ఓడిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. రానున్న మ్యాచ్లో అయినా హైదరాబాద్ జట్టు మెరుగైన ప్రదర్శన చేసి ముందుకు వెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు.