Sunny Leone Pic On Hall Ticket: వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్న కర్ణాటకలో మరో సంచలనం చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పేందుకు నిర్వహించే టీచర్స్ రిక్రూట్మెంట్ పరీక్ష హాల్ టికెట్ పై దారుణమైన తప్పు దొర్లింది. దీనిపై అభ్యర్థి ఫొటోకు బదులు స్టార్ హీరోయిన్ సన్నిలియోన్ ఫోటో ముద్రించబడింది. ఆ ఫోటో కూడా అసభ్యకరంగా ఉండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కర్ణాటక విద్యాశాఖలో అనేక వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ విషయంపై ప్రభుత్వానికి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే ఇది విద్యాశాఖాధికారులు చేసిన తప్పిదమా..? లేక అభ్యర్థికి అప్లోడ్ చేసే సమయంలో జరిగిందా..? అనేది తెలియాల్సి ఉంది. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం దీనిని అస్త్రంగా తీసుకొని విమర్శలు దాడికి దిగుతోంది.

కర్ణాటకలో ఇటీవల టీచర్స్ రిక్రూట్మెంట్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరు కాబోతున్న ఓ అభ్యర్థి హాల్ టికెట్ పై సన్నిలియోన్ ఫోటో కనిపించింది. దీంతో కంగుతిన్న ఆ అభ్యర్థి తన స్నేహితులకు తెలపడంతో పాటు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. అయితే ఓ యువతికి సంబంధించిన హాల్ టికెట్ పై ఈ ఫోటో రావడం గమనార్హం. దీంతో కర్ణాటక కాంగ్రెస్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం నేత బీఆర్ నాయుడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఇలాంటి తప్పులు ఎన్నో చేసిందని కన్నడంలో ట్విట్టర్లో మెసేజ్ పెట్టారు.
ఈ ఫొటో వైరల్ కావడంతో బీజేపీ ప్రభుత్వం స్పందించింది. విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ కార్యాలయం వివరణ ఇచ్చింది. అప్లికేషన్ సందర్భంలో అభ్యర్థి ఫోటో అప్లోడ్ చేస్తే దాని బదులు సన్నిలియోన్ ఫోటో రీప్లేస్ అయిందని తెలిపింది. అయితే ఈ విషయంపై పరీక్ష రాసే అభ్యర్థిని ప్రశ్నించగా.. తన అప్లికేషన్ వివరాలను తన భర్త స్నేహితుడు అప్లోడ్ చేశాడని పేర్కొంది. అయితే దీనిపై త్వరలో విచారణ జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని విద్యాశాఖ తెలిపింది.

కర్ణాటకలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా విద్యాశాఖలో ఇటువంటి పొరపాట్లు జరగడం గమనార్హం. గతంలో హిజాబ్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు పెల్లుబికిన విషయం తెలిసిందే. ఆ తరువాత మరికొన్ని ఇలాంటివే జరిగాయి. తాజాగా మరో సంఘటన కూడా విద్యాశాఖ కు సంబంధించిందే కావడం చర్చనీయాంశంగా మారింది.