
Bihar: పెళ్లంటే ఓ నమ్మకం. భార్య అంటే ప్రేమ. భర్త అంటే భరోసా. పిల్లలంటే మోయాలనిపించే బరువు. కుటుంబం గురించి ఓ సినీ కవి చెప్పిన మాటలు ఇవి. ఇప్పుడవేవీ లేవు. కాలానుగుణంగా సంసారంలోనూ మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులు కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి. ఇక ముల్లును ముల్లుతోనే తీయాలంటారు పెద్దలు. వీరు కూడా అలానే చేశారు. ఓ వ్యక్తి భార్య తన ప్రియుడితో లేచిపోతే.. అతడి భార్యతో ఇతడూ లేచిపోయాడు. ఇక్కడ లేచిపోవడం కామన్ కాదు.. అతడి భార్యను ఇతడు,. ఇతడి భార్యను అతడు చేసుకోవడం (దీన్ని ప్రేమ అనాలేమో) కామన్. వినడానికే కొంచెం తికమకగా అనిపించే ఆ ఆసక్తికర ఘటన, బీహార్ రాష్ట్రం హార్దియా గ్రామంలో జరిగింది.
14ఏళ్ల క్రితం పెళ్లి
గ్రామానికి చెందిన నీరజ్ కుమార్‌కు 14ఏళ్ల క్రితం రూబీ దేవి అనే ఆమెతో వివాహం జరిగింది. వారిద్దరికీ నలుగురు పిల్లలు జన్మించారు. అయితే, రూబీ పెళ్లికి ముందు నుంచే ముఖేశ్ కుమార్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. పెళ్లైన తర్వాత ఆ ప్రేమను కొనసాగించింది. మరోవైపు ముఖేశ్ కూడా రూబీ అన్న పేరు గల యువతినే కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. గత ఏడాది ఫిబ్రవరి 6న నీరజ్ భార్య రూబీ తన ప్రియుడు ముఖేశ్‌తో కలిసి పారిపోయింది. పోతూ పోతూ తన నలుగురు పిల్లల్లో కూతురిని వదిలేసి, మిగిలిన ముగ్గురినీ తీసుకెళ్లిపోయింది.

వారిద్దరికి పరిచయం
ఇటు భార్యను, అటు భర్తను పోగొట్టుకుని, చుట్టుపక్కల వారి మాటలతో బాధలో ఉన్న నీరజ్, ముఖేశ్ భార్య రూబీలకు మధ్య పరిచయం ఏర్పడింది. ఫోన్‌లో తమ కష్టసుఖాలను, భాగస్వాములు పారిపోవడం వల్ల ఏర్పడిన అవమానాలను పంచుకునేవారు. వారి పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. దీంతో ఈ నెల 11న ఈ ఇద్దరూ తమ ఇళ్ల నుంచి పారిపోయి, 18న కోర్టు అనుమతితో పెళ్లి చేసుకున్నారు. అనంతరం పిల్లలతో పాటు మధ్యప్రదేశ్ వెళ్లిపోయారు. ప్రస్తుతం వారు అక్కడే స్థిరపడినట్లు సమాచారం. ఈ విచిత్ర జంటల వినూత్న ప్రేమకథ ఇప్పుడు బిహార్‌లో అందరినోటా నానుతోంది.