Singaraya Jathara : సింగరాయ(Singaraya) జాతరగా పలిచే శ్రీప్రతాపరుద్ర సింగరాయ జాతరకు ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందినది. ఈ జాతరకు సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, మెదక్, హైదరాబాద్ జిల్లాలతోపాటు పూణె, ముంబై, షోలాపూర్, బీవండి తదితర పట్టణాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తారు. పచ్చని చెట్లు, కొండల మధ్య సెలయేరు మాఘమాస పిల్లగాలి భక్తులను ఆహ్వానిస్తాయి. అన్ని జాతరలకు భిన్నంగా సింగరాయ జాతర కేవలం ఒక్క రోజే జరుగుతుంది. ఏటా పుష్య బహుళ అమావాస్య రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జాతర నిర్వహిస్తారు. భక్తులు వేకువ జామునేజాతరకు వచ్చి తూర్పు నుంచి పడమరకు ప్రవహించే మోయతుమ్మెద వాగులో పుణ్యస్నానాలు చేస్తారు. నడకదారిన ఎత్తు వంపులు ఉన్న కొండలు ఎక్కి గుహలో కొలువుదీరిన లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. మొక్కులు చెల్లించుకుంటారు. పూజలు చేస్తారు. తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు.
సింగరాచ చరిత్ర ఇదీ..
ఓరుగల్లును పాలించిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు(Pratapa Rudrudu) ఈ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మిచలనుకుని సింగరాయ అనే ఇంజినీరును పంపించాడు. ప్రకృతి రమణీయలో కొండలు, మోయతుమ్మెద వాగు ఆహ్లాదకరమైన వాతావరణానికి ఇంజినీర్ మంత్రముగ్ధుడై ఇక్కడే కొండపై ఓ గుహలో లక్ష్మీనర్సింహస్వామిని ప్రతిష్టించిన లక్ష్మీనర్సింహస్వామని దర్శించుకున్నారు. ఇక నాటి నుంచే భక్తులు తూర్పు నుంచి పడమరకు ప్రవహించే నదిలో స్నానాలు చేస్తే రోగాలు పోతాయని ప్రగాఢంగా నమ్మేవారు. లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునే దారిలో చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం, ఆంజనేయస్వామి విగ్రహాలు నెలకొల్పి ఉన్నాయి.
చారిత్రక ఆనవాళ్లు…
జాతర జరిగే స్థలం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో అనేక చారిత్రక ఆనవాల్లు ఉన్నాయి. ఇందులో బౌద్ధ మతానికి సంబంధించిన చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం. గాజు పరిశ్రమ, అవశేషాలు, రాకాసి గూళ్లు(బృహత్ శిలా సమాధులు) కనిపిస్తాయి మోయతుమ్మెద నది తీరంవెంట వందలాది ఏళ్లు ఆదిమానవులు జీవనం సాగించినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు.
జాతరలో శాకాహార వంటలు…
సాధారణంగా లక్ష్మీనర్సింహస్వామి జాతర అంటే మాంసాహారం ఉంటుంది. కానీ సింగరాయ జాతరలో శాకాహార వంటలు ప్రత్యేకం. చిక్కుడు, టమాటా, వంకాయలు కలిపి ఇక్కడి నీటితో వంటలు చేసికున కుటుంబ సభ్యులు సహపంక్తి భోజనాలు చేస్తారు. వనమూలికలను తాకుతూ ప్రవహించే వాగు నీటితో చేసిన వంటలు రుచిగా ఉంటాయి. దివ్య ఔషధంగా కూడా పనిచేస్తాయని భక్తులు నమ్ముతారు.
జాతరకు ఇలా..
కోహెడ మండలం కూరెల్ల, తంగళ్లపల్లి, బస్వాపూర్, గుండారెడ్డిపల్లి గ్రామాల శివారులోని గుట్టల్లో జాతర సాగుతుంది. సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి బస్వాపూర్ వరకు బస్సులో వచ్చి అక్కడి నుంచి ఆటోలో జాతరకు చేరుకోవచ్చు. మరో మార్గం సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి శనిగరం వరకు బస్సులో వచ్చి.. అక్కడి నుంచి తంగళ్లపల్లి, కోహెడ మీదుగా ఆటోలో జారత ప్రాంతానికి చేరుకోవచ్చు. ఇక లక్ష్మీనర్సింహస్వామని దర్శించుకోవాలంటే సుమారు 2 లేదా 3 కిలోమీటర్లు నడవాల్సిందే.