May Day 2024: సమాన పనికి, సమాన వేతనం, హక్కులు, చట్టాల కోసం కార్మికులు నినదించారు. యాజమాన్యాల తీరును నిరసించారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడారు. అంతిమంగా విజయం దక్కించుకున్నారు. పోరాటాల ద్వారా తమ హక్కులను మే 1వ తేదీన సాధించుకున్నారు. అందుకే మే ఒకటో తేదీని ప్రపంచవ్యాప్తంగా మేడేగా జరుపుకుంటారు. అయితే మే ఒకటో తేదీ మే డేకు మాత్రమే గుర్తింపు కాదు.. ప్రపంచ చరిత్ర గతిని మార్చిన ఘనత మే ఒకటవ తేదీకి ఉంది. ఆ తేదీ నాడు జరిగిన ఆసక్తికరమైన సంఘటనలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
గ్రేట్ బ్రిటన్
1707 మే ఒకటో తేదీన ఇంగ్లాండ్, స్కాట్లాండ్ రాజ్యాలు యూనియన్ చట్టాల కింద ఏకమై గ్రేట్ బ్రిటన్ గా ఏర్పడ్డాయి. ఈ రెండు దేశాలు వారి ఉమ్మడి శత్రువులను ఎదుర్కోవడం, తమకు పోటీ వచ్చే దేశాలను అణచడం వంటి లక్ష్యాలతో ముందుకు సాగాయి. వెస్ట్ మినిస్టర్ నగరంలో ఏకికృత పార్లమెంటును ఏర్పాటు చేసుకున్నాయి. స్కాటిష్ పార్లమెంటును రద్దు చేశాయి. వలసవాద సామ్రాజ్య విస్తరణను పెంపొందించాయి. ఫ్రెంచ్ విస్తరణకు అడ్డుకట్ట వేసేందుకు ఇవి వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి. గ్రేట్ బ్రిటన్ ఆధిపత్యం ప్రపంచవ్యాప్తంగా కొనసాగేందుకు మే ఒకటవ తేదీ నాంది పలికిందని చరిత్రకారులు చెబుతుంటారు.
స్పీసిస్ ప్లాంటారం
1753 మే 1 తేదీన ఆధునిక వర్గీకరణ శాస్త్ర పితామహుడు కార్ల్ లిన్నేయస్ వర్గీకరణ శాస్త్రాన్ని ఆవిష్కరించాడు. వృక్షజాతుల సమగ్ర జాబితాను రూపొందించి, వెలుగులోకి తీసుకొచ్చాడు. వృక్షాల బైనామియల్ నామకరణ వ్యవస్థకు పునాది వేసి, రెండు లాటిన్ పదాల కలయికను ఉపయోగించి వృక్షజాతులకు పేరు పెట్టాడు. నేటికీ కార్ల్ లిన్నేయస్ “స్పీసిస్ ప్లాంటారం ” వాడుకలో ఉంది. వృక్షాలు, వాటి జాతులు, సంబంధాల గురించి తెలుసుకునేందుకు ఎంతగానో ఉపకరిస్తున్నది.
తపాలా స్టాంపు ఆవిష్కరణ
1840 మే 1న ప్రపంచంలోనే మొట్టమొదటి అంటుకునే తపాలా స్టాంపు (పెన్ని బ్లాక్) పేరుతో బ్రిటిష్ పోస్టల్ విభాగం సంచలన విధానానికి నాంది పలికింది. క్వీన్ విక్టోరియా ప్రొఫైల్ కలిగి ఉన్న ఒక చిన్న కాగితాన్ని ఆవిష్కరించి.. తపాలా సేవలో స్మారక మార్పును ప్రవేశపెట్టింది. దీనివల్ల సాధారణ ప్రజలు ఉత్తరాలు పంపడం మరింత సులువైంది. దీనికంటే ముందు ఉత్తరం పంపడానికి అయ్యే ఖర్చు మొత్తం.. రాసిన వ్యక్తి భరించాల్సి ఉండేది.
ఎంపైర్ స్టేట్ బిల్డింగ్
1931 మే 1న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ను ప్రారంభించారు. 102 అంతస్తులలో న్యూయార్క్ లో దీనిని నిర్మించారు. న్యూయార్క్ నగరం చారిత్రాత్మక, సాంస్కృతిక గుర్తింపును సూచించేలా ఈ భవనాన్ని నిర్మించారు. అమెరికా అనేక ఆర్థిక కష్టాలు పడుతున్నప్పటికీ ఈ భవనాన్ని అప్పట్లో నిర్మించడం విశేషం. చాలా సంవత్సరాల పాటు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కు పేరు ఉండేది.
కార్మికుల విజయం
1886 మే 1న అమెరికాలో సార్వత్రిక సమ్మె ప్రారంభమైంది. కార్మిక చరిత్రలో ఇది అత్యంత కీలకమైన ఘట్టం. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర అలజడి రేపేందుకు ఈ ఉద్యమం కారణమైంది. ఎనిమిది గంటల పని, అందుకు తగ్గట్టుగా విశ్రాంతి కావాలని కార్మికులు వీధుల్లోకి వచ్చారు. మెరుగైన జీవన ప్రమాణాల కోసం వారు పోరాడిన తీరు నేటికీ ఆదర్శంగా నిలుస్తోంది.
బాట్ మాన్ ఆవిర్భావం
1939 మే 1న డిటెక్టివ్ కామిక్స్ లో ఒకటైన బాట్ మాన్ నవల మార్కెట్లోకి వచ్చింది. అతడి తెలివి, శారీరక పరాక్రమం.. సంప్రదాయ సూపర్ హీరో ఇమేజ్ ను దెబ్బకొట్టాయి. ఫలితంగా పాఠకులు విపరీతంగా ఆ కామిక్ పుస్తకాన్ని చదవడం ప్రారంభించారు. ఇప్పటికీ బాట్ మన్ సిరీస్ హాలీవుడ్లో ఒక ట్రెండ్ సెట్టర్.
ది మ్యారేజ్ ఆఫ్ ఫిగారో
ప్రసిద్ధ రచయిత ఫియర్ బ్యూమర్ చైస్ రచించిన అద్భుతమైన నాటకం “ది మ్యారేజ్ ఆఫ్ ఫిగారో” . 1786 మే 1న ఇది ప్రదర్శితమైంది. స్టేజ్ కామెడీగా ఫియర్ బ్యూమర్ చైస్ రచించిన “ది బార్బర్ ఆఫ్ సెవిల్లే” కి “ది మ్యారేజ్ ఆఫ్ ఫిగారో” సీక్వెల్. ప్రేమ, ద్రోహం, క్షమాపణ వంటి వాటి చుట్టూ ఈ నాటకం నడుస్తుంది. సంగీతం ద్వారా మానవ భావోద్వేగాలను ప్రతిబింబించడం ఈ నాటకం గొప్పతనం.. ఇప్పటికీ ఈ నాటకాన్ని అప్పుడప్పుడు ప్రదర్శిస్తూనే ఉంటారు.
స్కాటిష్ స్వాతంత్ర్యం
మే ఒకటి 1328న ఎడిన్ బర్గ్ – నార్తాంప్టన్ మధ్య జరిగిన ఒప్పందం స్కాటిష్ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోయింది. స్కాట్లాండ్ స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందింది. అలెగ్జాండర్ – 3 మరణం తర్వాత అనేక దౌత్యపరమైన చర్చలు జరిగాయి. కొన్నిసార్లు సంఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. స్కాట్లాండ్ కు భవిష్యత్తు వారసుడు లేకపోవడంతో.. ఇంగ్లాండ్ పాచికలు పారలేదు. ఫలితంగా స్కాట్లాండ్ స్వయం ప్రతిపత్తి పొందింది. శాంతి ఒప్పందంలో భాగంగా స్కాట్లాండ్ పాలకులకు భూములు, పట్టాలు అందజేయాలని ఇంగ్లాండ్ ను ఆదేశించారు.
సూపర్ నోవా విస్ఫోటనం
1006, మే 1వ తేదీన లూపస్ రాసి లో ఉన్న ఒక సూపర్ నోవా విస్పోటనం చెందింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించారు. Sn 1006 అని పిలిచే ఈ సూపర్ నోవా అత్యంత ప్రకాశమంతంగా ఉంది. దీనిని ఖగోళ శాస్త్రవేత్తలు అతిధి నక్షత్రంగా పేర్కొన్నారు. ఎంత అకస్మాత్తుగా ఇది కనిపించిందో.. కొద్ది నెలల్లో హఠాత్తుగా క్షీణించింది. దీని తర్వాత శాస్త్రవేత్తలు అనేక రకాల ప్రయోగాలు చేశారు. అంతరిక్షంపై పట్టు సాధించారు.