Emotional Photo: ఆకలి అయిన వాడికి అన్నం ఉండదు. అన్నం ఉన్నవాడికి ఆకలి విలువ తెలియదు. అందుకే సమాజంలో పూర్వకాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు అంతరాలు అలాగే కొనసాగుతున్నాయి. అలాంటి అంతరాల వల్లే సమాజం విడిపోయి ఉంది. అలాంటి సమాజాన్ని ఏకరూపం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని నేతలు చెబుతున్నప్పటికీ.. వాస్తవ రూపం మాత్రం వేరే విధంగా ఉంటుంది. ఏలుతున్న నాయకులు పదేపదే సమిష్టి అనే పదాన్ని వల్లె వేస్తున్నప్పటికీ. చేతల్లో మాత్రమే కనిపించడం లేదు.
స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ నేటికీ దేశంలో నూరు శాతం అక్షరాస్యత సాధ్యం కావడం లేదు. మనకంటే వెనుకకు స్వాతంత్రం సాధించుకున్న దేశాలు అక్షరాస్యతలో ముందు వరుసలో ఉంటున్నాయి. అభివృద్ధి విషయంలోనూ అదే బాట అనుసరిస్తున్నాయి. భారతదేశంలో పోల్చితే ఎన్నో రెట్లు చిన్న దేశమైన సింగపూర్, మలేషియా వంటివి ఆర్థిక అభివృద్ధిలో చాలా ముందంజలో ఉన్నాయి. అక్షరాస్యత విషయంలోనూ అదే స్థాయిలో ఉన్నాయి. మరి మన దగ్గర ఎక్కడ లోపం ఉందంటే.. అడుగడుగునా అన్ని విషయాల్లో రాజకీయం పెరిగిపోవడం.. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నగదులో అవినీతి పేరుకుపోవడం. పేదరికం వంటివి అక్షరాస్యతను పెరగకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం అరచేతిలో ప్రపంచం ఇమిడి పోతున్న ఈ రోజుల్లో జానెడు పొట్ట కోసం విలువైన బాల్యాన్ని, చదువుకునే వయసుని త్యాగం చేస్తున్న పిల్లలు ఎంతోమంది. ఎండు డొక్కలు, పుండు రెక్కలతో గనిలో, కార్ఖానా లో చాలా మంది పిల్లలు మగ్గి పోతున్నారు. ఈ టెక్ యుగం లోనూ “ఆపరేషన్ ముస్కాన్” వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది అంటే దుస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సర్వేలో ఇప్పటికి భారతదేశంలో చాలామంది పిల్లలు బడి మొఖం చూడటం లేదు. కేవలం గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడా ఈ దుస్థితి ఉంది. తల్లిదండ్రుల పేదరికం వల్ల పిల్లలు చదువుకోలేకపోతున్నారని తేలింది. ప్రభుత్వం ఏట వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ అవి ఆశించినంత ఫలితం ఇవ్వడం లేదు. ఎందుకంటే అక్షరాస్యత అనేది పెరగకుంటే దేశం అనేది అభివృద్ధి చెందదు. ఉదాహరణకు అమెరికాను తీసుకుంటే అక్కడ అక్షరాస్యత ఎక్కువగా ఉంటుంది. పిల్లల్ని కచ్చితంగా పాఠశాలలకు పంపిస్తారు. అక్కడ నిర్బంధ విద్య అనేది అమలవుతోంది. ఫలితంగా అమెరికా ఆగ్రరాజ్యంగా వెలుగొందుతోంది.. మన దగ్గర కూడా నిర్బంధ విద్య అనే చట్టం ఉన్నప్పటికీ అది ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదు. ఫలితంగా పలక, బలపం పట్టాల్సిన పిల్లలు పనులకు వెళ్తున్నారు. తమ ఈడు పిల్లలు పాఠశాలలకు వెళుతుంటే దీనంగా చూస్తున్నారు. ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనప్పుడు చూసేవారికి బాధ కలుగుతుంది. అందుకే కొన్ని ఫోటోలు మౌనంగానే ప్రశ్నిస్తాయి.