
Sobhita Dhulipala: సమంత పెళ్లి వేడుకల్లో హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల సందడి చేస్తున్నారు. ఇవి ఎప్పటికీ మరచిపోలేని క్షణాలు అంటూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. కొన్నాళ్లుగా టాలీవుడ్ లో శోభిత దూళిపాళ్ల పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కారణం… ఆమె హీరో నాగ చైతన్య లవర్ గా ప్రచారం అవుతున్నారు. కొన్ని ఆధారాలు చూపుతూ నాగ చైతన్య-శోభిత మధ్య ఎఫైర్ నడుస్తుందని కథనాలు వెలువడుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఈ పుకారు మొదలైంది. నాగ చైతన్య కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి తరచుగా శోభితను తీసుకెళుతున్నాడని, అక్కడ ఇద్దరు కలుస్తున్నారంటూ వార్తలొచ్చాయి. ఈ వదంతులను నాగ చైతన్య టీం ఖండించారు. ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు ఎవరో కావాలని చేస్తున్న ప్రచారం అంటూ కొట్టిపారేశారు.
కాగా ఇటీవల నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల కలిసి ఉన్న ఫోటో బయటకు వచ్చింది. లండన్ లో ఓ ఇండియన్ రెస్టారెంట్ కి జంటగా వెళ్లినట్లు ఆధారం లభించింది. ఆ హోటల్ చెఫ్ సురేందర్ మోహన్ నాగ చైతన్యతో సెల్ఫీ దిగారు. దాన్ని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అనుకోకుండా ఆ ఫొటోలో శోభిత ధూళిపాళ్ల క్యాప్చర్ అయ్యారు. దాంతో మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. వెంటనే సదరు చెఫ్ ఆ ఫోటోను డిలీట్ చేశారు.
నాగ చైతన్య-శోభిత ఎఫైర్ రూమర్స్ హాట్ హాట్ గా నడుస్తుండగా… శోభిత ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ ఆసక్తిరేపుతున్నాయి. ఆమె సమంతకు వివాహం, నేను ఎంతగానో అందిస్తున్న క్షణాలు అంటూ ఇంస్టాగ్రామ్ స్టేటస్ పెట్టారు. అలాగే సమంత పెళ్లి వేడుకలో ఫోటోలు దిగి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. బంధువులు, సన్నిహితులతో కూడిన క్షణాలు ఎప్పటికీ నిలిచిపోయేవి అంటూ… కామెంట్స్ పెట్టారు.

అసలు సమంత పెళ్లేంటని జనాలు ఆశ్చర్యపోయారు. తీరా చూస్తే ఆమె చెబుతున్న సమంత వేరు. శోభిత ఫ్రెండ్ పేరు కూడా సమంతనే అట. ఆమె పెళ్లి గురించి ఉద్దేశిస్తూ శోభిత ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ పెట్టారు. జనాలేమో హీరోయిన్ సమంత పెళ్ళని పొరపాటు పడ్డారు. దాంతో శోభిత ధూళిపాళ్ల పోస్ట్స్ వైరల్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలి శోభిత సొంతూరు. ఆమె కెరీర్ మాత్రం బాలీవుడ్ లో మొదలైంది. తెలుగులో గూఢచారి, మేజర్ చిత్రాలు చేశారు. పొన్నియిన్ సెల్వన్ సిరీస్లో ఆమె ఓ పాత్ర చేశారు.