Vizag: జ్ఞాపకాలను పదులపరుచుకోవడానికి తీసుకున్న ఫోటో.. జీవితాంతం చెరిగిపోని చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. వీకెండ్ ఎంజాయ్ చేయాలని భావించిన ఆ ఆరుగురు స్నేహితులకు జీవితంలో మర్చిపోలేని విషాదం మిగిలింది. రాకాసి అల ఆరుగురుని కబళించే ప్రయత్నం చేసింది. కానీ అందులో ఒకరు మృతి చెందగా.. మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. నలుగురు క్షేమంగా బయటపడ్డారు. విశాఖ జిల్లాలో వెలుగు చూసిన దారుణమిది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖ నగరంలోని వన్ టౌన్ కు చెందిన కొట్టొజు సాయి (19), కట్టొజు కావ్య (17), సింహాచలానికి చెందిన గన్నవరపు సాయి ప్రియాంక(27), గన్నవరపు రవిశంకర్ (28), అల్లిపురానికి చెందిన కండిపల్లి ఫణీంద్ర (25), గండిపల్లి సాయికిరణ్ (25)లు ఆదివారం ఉదయం రాంబిల్లి మండలం సీతాపాలెం సముద్ర తీరానికి విహారం కోసం వెళ్లారు. తీరంలో సరదాగా గడిపిన వీరు సముద్రంలో స్నానానికి దిగారు. రాళ్లపై నుంచి ఫోటో తీసుకుంటుండగా ఒక్కసారిగా పెద్ద కెరటం వచ్చింది. దీంతో వీరందరూ సముద్రంలో పడి కొట్టుకుపోయారు. వెంటనే చుట్టుపక్కల ఉన్నవారు గమనించి కేకలు వేశారు. తీరంలో ఉన్న మత్స్యకారులు అప్రమత్తమయ్యారు. ఒక్క సాయి మినహా.. మిగిలిన ఐదుగురిని బయటకు తీసుకు రాగలిగారు.
అయితే ఇందులో సాయి ప్రియాంక ఉప్పునీరు తాగేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. మిగిలిన నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన సాయి మృతదేహం కొంతసేపటి తర్వాత తీరని కొట్టుకు వచ్చింది. కోమాలోకి వెళ్లిన సాయి ప్రియాంక ప్రస్తుతం విశాఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.