Delhi Liquor Scam- MLC Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముద్దుల తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం చుట్టుముడుతోందా.. అక్రమ దందా గుట్టు రట్టు కాబోతోందా అంటే అవుననే అంటున్నాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు. ఇప్పటికే దినేష్∙అరోరా చార్జిషీట్‌లో కవిత పేరు చేర్చిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. తాజాగా సమీర్ మహేంద్రుపై వేసిన చార్జిషీట్‌లోనూ ఆమె పేరు చేర్చడంతోపాటు మరిన్ని కీలక వివరాలు అందులో ప్రస్తావించింది. ఇందులో కవిత పది ఫోన్ల ధ్వంసంతోపాటు కవిత వాటా, ఒబెరాయ్ హోటల్‌లో రహస్య సమావేశాలు, వాట్సాప్, ఫోన్ సంభాషణల గురించి ప్రస్తావించింది. సమీర్ కంపెనీలో కవితకు 32 శాతం వాటా ఉన్నట్లు అభియోగం మోపింది. సమీర్ మహేంద్రు చార్జిషీట్‌లో ఎమ్మెల్సీ కవిత, మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మూత్తం గౌతమ్, అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్‌రావు పేర్లు కూడా చేర్చింది.

ఒబెరాయ్ హోటల్ కేంద్రంగా దందా..
ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్ కేంద్రంగానే లిక్కర్ స్కాం రూపకల్పన జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి ఒబెరాయ్ హోటల్‌లో సమావేశాలు ఏర్పాటు చేసినట్టు ఈడీ విచారణలో సమీర్ మహేంద్రు అంగీకరించినట్లు ఈడీ చార్జిషీట్‌లో స్పష్టంగా పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి, అభిషేక్, బుచ్చిబాబు ఒబెరాయ్ హోటల్ సమీర్ మహేంద్రు కలిసినట్టు ఈడీ చార్జిషీట్‌లో ప్రస్తావించింది.
చార్టెడ్ ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు..
ఒబెరాయ్ హోటల్‌లో లిక్కర్ ప్లాన్ రూపొందించిన తర్వాత కవిత, శరత్‌చంద్రారెడ్డి, అభిషేక్, బుచ్చిబాబు కలిసి శరత్ చంద్రారెడ్డికి సంబంధించిన ప్రత్యేక విమానం(చార్టెడ్ ఫ్లైట్)లో హైదరాబాద్ వెళ్లినట్టు ఈడీ చార్జిషీట్‌లో పేర్కొంది. అంతకుముందు ఒబారాయ్ హోటల్‌లో జరిగిన మీటింగ్‌లో కవిత, అరుణ్ పిళ్లై, దినేష్ అరోరా, విజయ్‌నాయర్ పాల్గొనట్టు స్పష్టంగా తెలిపింది.
ఇండో స్పిరిట్స్‌లో కవితకు వాటా..
ఇండో స్పీరిట్స్‌లో ఎల్1 కింద వచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉన్నట్లు ఈడీ పేర్కొంది. ఇండో స్పిరిట్స్ కి రూ.192.8 కోట్లు లాభం వచ్చిందని, ఇదంతా నేరపూరితమైన మార్గంలో వచ్చిందని వివరించింది. ఇక శరత్‌చంద్రారెడ్డి చేతుల్లో ఐదు రిటైల్ జోన్లను అభిషేక్‌రావు నడిపిస్తున్నట్లు పేర్కొంది. ఈ కీలక సమాచారంతోపాటు కవిత వాడి ధ్వంసం చేసిన పది ఫోన్ల వివరాలను సమీర్ మహేంద్రు చార్జ్‌షీట్‌లోనూ ప్రస్తావించింది.

ఖండించని కవిత..
ఢిల్లీ లిక్కర్‌స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌పై ఇప్పటి వరకు కవిత స్పందించలేదు. తాను లిక్కర్ వ్యాపారం చేయడం లేదని కానీ, ఒబెరాయ్ హోటల్‌లో సమావేశం కాలేదని కానీ పేర్కొనడం లేదు. పది ఫోన్ల ధ్వంసం విషయంపై నోరు మెదపడం లేదు. తాజాగా చార్జిషీట్‌తో కవిత అక్రమాలు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజా ఆధారాలతో కవితను ఈడీ విచారణకు పిలిఇచే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.