KCR BRS: కేంద్రంలో బీజేపీని గద్దె దించాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు లక్ష్యంవైపు దూసుకుపోతున్నారు. ఒకవైపు కేంద్రం దర్యాప్తు సంస్థలతో దూకుడు పెంచుతున్నా.. గులాబీ బాస్ మాత్రం ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు. ఇటీవల దేశ రాజధానిలో భారత్ రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్.. తాజాగా పార్టీ విస్తరణపై దృష్టి సారించారు. డిసెంబర్ నెలాఖరు నుంచి బీఆర్‌ఎస్ కార్యకలాపాలు దేశ వ్యాప్తంగా నిర్వహించేలా ప్లాన్ రూపొందిస్తున్నారు.

ఢిల్లీ కేంద్రంగా రాజకీయం.. .
ఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజకీయాలు ప్రారంభించాలని బీఆర్‌ఎస్ అధినేత భావిస్తున్నారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి పార్టీ కేంద్ర కార్యలయంలో వివిధ పార్టీల నేతలు రైతు సంఘాల నేతలతో వరుస భేటీలు జరిపే అవకాశం ఉంది. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్న నినాదంతో ముందుకు పోవాలని పార్టీ ఆవిర్భావం రోజు హైదరాబాద్‌లో కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ముందుగా ఆరు రాష్ట్రాల్లో పార్టీ అనుబంధంగా భారత రాష్ట్ర కిసాన్ సమితి విభాగాలను ప్రారంభించాలని నిర్ణయించారు.
ఆరు రాష్ట్రాలపై ఫోకస్
క్రిస్మస్ తర్వాత ఆయా రాష్ట్రాల్లోని భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు, నేపథ్యాలను అనుసరించి అక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు ఎలాంటి విధానాలు అవలంభించాలన్న విషయమై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఆ దిశగా నేతలను సమాయాత్తం చేస్తున్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్‌తోపాటు పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తెలంగాణలో బీఆర్‌ఎస్ కిసాన్ సెల్‌ను ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బీఆర్‌ఎస్‌లో చేరికలపై దృష్టి..
కేసీఆర్ జాతీయ పార్టీపై ఇప్పపై ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రమే కేసీఆర్‌కు మద్దతు ఇస్తున్నారు. కేంద్ర కార్యాలయం ప్రారంభం తర్వాత బీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు ఉంటాయని గులాబీ బాస్ భావించారు. కానీ పరిస్థితి భిన్నంగా ఉంది. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం పంపినా చాలామంది దూరంగా ఉన్నారు. దీంతో పార్టీని విస్తరించాలంటే ముందు చేరికలు జరపాలని కేసీఆర్ భావిస్తున్నారు. వచ్చే ఏడాది మొదటి నెల నుంచే చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అప్పుడే మరింత వేగంగా బీఆర్‌ఎస్ కార్యకలాపాలు విస్తారిస్తాయని చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్ తన వాణి వినిపిస్తూ.. దేశ ప్రజలను ఆకర్షిస్తూ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి.. ఇతర రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రమైన ఏపీ ప్రజలు, రాజకీయ నాయకులను ఆకర్షిస్తోందని బీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌లో తాము భాగస్వాములమవుతామని ఏపీతోపాటు పలు రాష్ట్రాల నేతలు ముందుకు వస్తున్నారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

చేరికల కోసం మంతనాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ను ప్రారంభించడానికి రంగం సిద్దం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉత్తరాంధ్ర సహా పలు జిల్లాల నుంచి ఇప్పటికే 70–80 మంది ప్రముఖులు కేసీఆర్‌ను సంప్రదించినట్లు వెల్లడించాయి. ఏపీతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కూడా పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సుముఖత చూపుతున్నారని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే కన్నడ, మరాఠ, ఒరియా తదితర భాషలకు చెందిన రచయితలు, సాహితీవేత్తలు, పాటల రచయితలతో పార్టీ అధినేత కేసీఆర్ చర్చలు జరుపుతున్నారని తెలిపాయి. డిసెంబర్ నెలాఖరులో ఢిల్లీ వేదికగా కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు బీఆర్‌ఎస్‌ను అన్ని విధాలా సిద్ధం చేసేందుకు కసరత్తు వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.