
Y. S. Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్టు చేసి విచారిస్తున్న సిబిఐ.. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత అప్రమత్తమైన అవినాష్ రెడ్డి.. తనను అరెస్టు చేయకుండా చూడాలంటూ తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. కనీసం ముందస్తు బెయిల్ అయినా మంజూరు చేయాలని ఆయన కోరగా.. తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను సోమవారం ఇచ్చింది. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా చూడాలంటూ, ఒకవేళ అరెస్టు చేసిన ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా, ఈ నెల 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దంటూ ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఈ మధ్యంతర ఉత్తర్వులను వివేకా కుమార్తె డాక్టర్ సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు..
హత్య కేసులో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ డాక్టర్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు మెయిల్ అంశంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ అంశంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టింది. ఈ ఉత్తర్వులు ఆమోదయోగ్యమైనవి కాదని అభిప్రాయపడింది. డాక్టర్ సునీత దాఖలు చేసిన ఈ పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

కేసు విచారణపై ప్రభావం..
అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తే.. కేసు విచారణపై దాని ప్రభావం పడుతుందని సిబిఐ తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ప్రలోభాలు కూడా పని చేశాయని వారు పేర్కొన్నారు. సీబిఐ తరపు న్యాయవాదులు వాదనలు విన్న తర్వాత.. ఈ నెల 24న పూర్తిస్థాయి విచారణ చేపడతామని.. అప్పుడు అన్ని విషయాలను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఈనెల 24 వరకు అవినాష్ ను అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు సిబిఐను ఆదేశించింది. ఈనెల 30 లోపు కేసు విచారణ పూర్తి చేయాలంటూ గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను పొడిగిస్తామని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తెలిపింది. తాజా సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కేసుపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ 24న సుప్రీంకోర్టులో జరగనున్న పూర్తిస్థాయి విచారణ తర్వాత ఏసు మరింత ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుందని చెబుతున్నారు.