AP Secretariat: ఏపీలో మూడు రాజధానుల అంశం మరోసారి తెరపైకి వస్తోంది. ఇప్పటికే రాజధానుల విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఈ నెల 31న మరోసారి పిటీషన్లు అత్యున్నత న్యాయస్థానం ముందుకు విచారణకు రానున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కారు రాజధానుల విషయంలో స్పీడు పెంచుతోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారన్న అపవాదు నుంచి తప్పించుకునేందుకు.. అమరావతి నుంచి విశాఖకు సచివాలయాన్ని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అటు ఉత్తరాంధ్ర మంత్రులు గత కొద్దిరోజులుగా ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు. మీడియాకు లీకులిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉగాది నాటికి విశాఖ నుంచి పాలన ప్రారంభమవుతుందని చెబుతున్నారు. రెండు రోజుల కిందట రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు.

వచ్చే నెలలో రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు రాజధానుల కోసం ఉద్దేశించిన ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లు బడ్జెట్ సమావేశంలో పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అవసరమైన ప్రక్రియను అధికారులు పూర్తిచేసినట్టు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో బిల్లును ఆమోదించే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ బిల్లుకానీ సభ ఆమోదం పొందితే విశాఖ నుంచి సీఎం జగన్ పాలన లాంఛనమే. విశాఖ నుంచి పాలనపై ఇటీవల ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి 22 ఉగాది అని.. అంతకంటే ముందా? లేకుంటే తరువాత అన్నది త్వరలో వెల్లడిస్తామని చెప్పి.. ప్రభుత్వం ప్రాధాన్యతాంశంగా తీసుకుందని చెప్పకనే చెప్పారు.
మరోవైపు రాజధానుల అంశంపై దాఖలైన పిటీషన్లపై ఈ నెల 31న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. అమరావతి ఏకైక రాజధాని అన్న హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్ఛిన సంగతి తెలిసిందే. అయితే దాఖలైన పిటీషన్లు మరోసారి అత్యున్నత న్యాయస్థానంలో విచారణలోకి రానున్నాయి. ప్రభుత్వం తమకు సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశతో ఉంది. అందుకే విశాఖ నుంచి పాలన సాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలన్నది నిర్దేశించిడానికి కోర్టులు టౌన్ ప్లానింగ్ కార్యాలయాలు కావంటూ గతంలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలతో.. ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానులకు మద్దతుగానే అత్యున్నత న్యాయస్థానం తీర్పు వస్తుందని వైసీపీ సర్కారు భావిస్తోంది.

ఉగాది కంటే ముందుగానే విశాఖ నుంచి పాలన మొదలైన ఆశ్చర్యపోనక్కర్లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ముందుగా సీఎం క్యాంప్ ఆఫీసు ప్రారంభించి.. తరువాత సచివాలయ తరలింపునకు ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు మంత్రులు సైతం తమ క్యాంప్ ఆఫీసుల నిర్వహణకు సరైన భవనాల ఎంపిక చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తానికైతే రాజధానుల అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ నుంచి పాలనను ప్రారంభించి విపక్షాలకు గట్టి సమాధానమే చెప్పాలని భావిస్తోంది.