
MP Avinash Reddy Bail Petition: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సిబిఐ అధికారులు జోరు పెంచారు. ఇప్పటికే తన తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడంతో.. తదుపరి లక్ష్యం తానే అని భావించిన అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. బెయిల్ పిటీషన్ లో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది.
నాలుగేళ్ల కిందట రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి విచారిస్తున్న సిబిఐ అధికారులు.. తాజాగా ఆదివారం కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. భాస్కర్ రెడ్డిని విచారణకు ఇవ్వాలని కోరుతూ సిబిఐ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో జోరు పెంచిన సిబిఐ అధికారులు తరువాత అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును సోమవారం ఆశ్రయించారు.
విచారణకు రావాలంటూ అవినాష్ కు సిబిఐ నోటీసులు..
ఇదిలా ఉండగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాల్సిందిగా సిబిఐ నోటీసులను ఎంపీ అవినాష్ రెడ్డికి పంపించింది. ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసిన అవినాష్ రెడ్డి.. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు. సిబిఐ తనను మూడు గంటలకు విచారణకు హాజరు కావాలని పిలిచిన నేపథ్యంలో.. ముందస్తు బెయిల్ పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని హైకోర్టును ఆయన కోరారు. బెయిల్ పిటీషన్ పై మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ జరగనుంది.
అనేక అంశాలు ప్రస్తావన..
బెయిల్ పిటీషన్ లో అవినాష్ రెడ్డి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. వివేక హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, దస్తగిరి వాంగ్మూలం మేరకు నన్ను ఇరికించాలని సిబిఐ చూస్తోందంటూ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. నిందితుడిగా చేర్చి అరెస్టు చేసే ఉద్దేశంలో సిబిఐ ఉందని, ఆశ్చర్యంగా గూగుల్ టేక్ అవుట్ డేటా తెరపైకి తెచ్చిందని ఈ సందర్భంగా ఆయన అందులో పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఎక్కడున్నారో గూగుల్ టేక్ అవుట్ డేటా చెప్పలేదని, నాలుగేళ్లలో అనేక పరిణామాలు తర్వాత నన్ను లక్ష్యంగా చేసుకున్నారని బెయిల్ పిటిషన్ లో అవినాష్ రెడ్డి వెల్లడించారు. తనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని, ఒకవేళ అరెస్టు చేస్తే బెయిల్ పై విడుదల చేసేలా ఆదేశించాలని అవినాష్ రెడ్డి కోరారు.

సహ నిందితుడిగా చేర్చిన సిబిఐ..
వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు సహనిందితుడిగా చేర్చారు. సహ నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు పంపించింది. సిబిఐ నోటీసులు నేపథ్యంలో పులివెందుల నుంచి హైదరాబాద్ కు ఆయన బయలుదేరారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాదులోని సిబిఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కానున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి కస్టడీ పిటీషన్ పై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. వివేకానంద రెడ్డి కేసులో నాలుగేళ్ల తర్వాత జోరు పెరగడంతో కొద్దిరోజుల్లోనే ముద్దాయిలు ఎవరనేది తేలిపోనుందని అంతా చర్చించుకుంటున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించి సోమవారం కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేసినా, తెలంగాణ హైకోర్టు బెయిల్ పిటీషన్ స్వీకరించి బెయిల్ మంజూరు చేసినా.. ఈ కేసులో కీలకమైన అంశంగానే భావించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లోనే తెలిసే అవకాశం ఉంది.