Saudi Man Marries: సరైన ఈడు వచ్చినా పెళ్లి కాకుండా ఎంతోమంది బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు. ఒంటికాయ శొంఠి కొమ్ము లాంటి జీవితాన్ని నిస్సారంగా గడుపుతున్నారు. అలాంటివారు కుళ్లుకునే పనిచేశాడు ఈ 90 సంవత్సరాల వృద్ధుడు. బెండకాయ ముదిరితే కూరకు పనికిరాదు. బ్రహ్మచారి వయసు పెరిగితే పెళ్లికి అనే సత్తె కాలపు సామెతను సమూలంగా మార్చేశాడు. అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా నిలిచాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకుని ఔరా అనిపించాడు. సౌదీ అరేబియా లోనే అత్యధిక వయసు కలిగిన వరుడిగా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు ఆ వృద్ధుడు తన ఐదవ భార్యతో హనీమూన్ లో ఉన్నాడు. భవిష్యత్తులో ఇలాంటి పెళ్లిళ్లు చాలా చేసుకుంటానని చెబుతున్నాడు. అది కూడా ఐదవ భార్యతో హనీమూన్ లో ఉన్నప్పుడు..
ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడు
గల్ఫ్ మీడియా చెబుతున్న దాని ప్రకారం నాదిర్ బిన్ ద హైమ్ వాహక్ ఆల్ ముర్షిది అల్ ఓతాబి తాజాగా సౌదీ అరేబియాలోని తన కార్యాలయ ప్రాంతంలో ఐదవ వివాహం చేసుకున్నాడు. అయితే ఈ వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో పెళ్లికి వచ్చిన వారంతా ఆ వృద్ధ వరుడికి ఐదవ పెళ్లి శుభాకాంక్షలు చెబుతున్నారు. దీంతో ఆ వృద్ధుడు అమితమైన ఆనందంతో ఉప్పొంగిపోయి కనిపిస్తున్నాడు. ఆ వీడియోలో ఆ వృద్ధుడికి తన మనవడు వివాహ శుభాకాంక్షలు తెలియజేయడం హైలైట్ గా నిలిచింది.. అంతేకాదు తన మనవడు ఇచ్చిన పుష్పగుచ్చాన్ని ఆ వృద్ధపరుడు అత్యంత ఇష్టంతో తీసుకున్నాడు.
పెళ్లి చేసుకోవడం వల్లే సుఖంగా ఉన్నాడట
అనంతరం ఆ వృద్ధ వరుడు సౌదీ అరేబియాలోని ఒక మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. “పెళ్ళికాని వారంతా తప్పకుండా వివాహం చేసుకోవాలి. వివాహం అనేది ఒక అద్భుతమైన ఘట్టం. మనిషి జీవితాన్ని మరింత పరిపూర్ణంగా మారుస్తుంది. ఈ పెళ్లి తర్వాత కూడా నేను మరో వివాహం చేసుకుంటాను. పెళ్లి చేసుకోవడం వల్ల జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. నేను ఐదు పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే సుఖంగా ఉన్నాను. 90 సంవత్సరాల వయసులోనూ ఉత్సాహంగా కనిపిస్తున్నాను” అంటూ ఆ వృద్ధు వరుడు తన సందేశాన్ని ప్రకటించాడు.
వధువు వయసు వెల్లడించలేదు
సాధారణంగా గల్ఫ్ దేశాలలో పాలిగమి (ఎక్కువమంది భార్యలు కలిగి ఉండటం) అనేది సర్వసాధారణం. పైగా అక్కడివారు ఎన్ని వివాహాలు చేసుకుంటే అంత గొప్ప అని భావిస్తారు. తక్కువలో తక్కువ ఒక్కో ముస్లిం వ్యక్తి రెండు నుంచి నాలుగు వరకు వివాహాలు చేసుకుంటారని సమాచారం. అయితే వీరంతా ఎక్కువ వివాహాలు చేసుకున్నప్పటికీ కలిసే ఉంటారు. అయితే భరణాల చెల్లింపు విషయంలో మాత్రం తమ చట్టాలను పాటిస్తారు. ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ భార్యలందరినీ సమాన దృష్టితో చూస్తారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వృద్ధ వరుడి వీడియో వైరల్ గా మారింది. అయితే ఆ వృద్ధ వరుడు వివాహం చేసుకున్న మహిళ వయసు మాత్రం ఎంత అనేది అక్కడ మీడియా చెప్పలేదు. ఆ వృద్ధ వరుడు కూడా వెల్లడించలేదు..
90 برس کی عمر میں پانچویں شادی رچانے والے معمر ترین سعودی دلہا نے کنوارے نوجوانوں کا کیا مشورہ دیے، ویڈیو دیکھیےhttps://t.co/laYvvZpxUy pic.twitter.com/da0hb4WE3w
— العربیہ اردو (@AlArabiya_Ur) July 13, 2023