
Samyuktha Menon: టాలీవుడ్ లో కేరళ, కర్ణాటక భామల హవా నడుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్స్ ని కూడా కాదని మన హీరోలు సౌత్ సుందరాంగులు వెంటపడుతున్నారు. పూజా హెగ్డే ముంబైలో పెరిగిన కన్నడ అమ్మాయి. ఇక రష్మిక, శ్రీలీల, కృతి శెట్టి కర్ణాటక హీరోయిన్సే. కీర్తి సురేష్,నిత్యా మీనన్, అనుపమ పరమేశ్వరన్, నివేదా థామస్, నివేదా పేతురాజ్ లు కేరళ కుట్టీలు. సౌత్ ఇండియాలో అత్యంత అందగత్తెలుగా కేరళ హీరోయిన్స్ కి పేరుంది. పలువురు మలయాళ హీరోయిన్స్ మన పరిశ్రమను ఏలారు. తాజాగా మరో కేరళ కుట్టి తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు సంయుక్త మీనన్.
వస్తూనే సంయుక్త అరుదైన రికార్డు నమోదు చేసింది. తెలుగులో హ్యాట్రిక్ విజయాలు అందుకుంది. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్ మూవీతో సంయుక్త టాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఆ చిత్రంలో రానా భార్యగా ఆమె కనిపించారు. పెద్దగా ప్రాధాన్యత ఉన్న పాత్ర కాకున్నా తన పరిధిలో మెప్పించే ప్రయత్నం చేశారు. భీమ్లా నాయక్ విజయం సాధించడంతో ఒక హిట్ తన ఖాతాలో పడింది. పవన్ కళ్యాణ్ మూవీ కావడంతో చిన్న పాత్రతో కూడా ఆమె ఆడియన్స్ కి దగ్గరయ్యారు.
అనంతరం కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార మూవీలో ఛాన్స్ దక్కించుకున్నారు. సోసియో ఫాంటసీ జోనర్లో దర్శకుడు వశిష్ట్ తెరకెక్కించిన బింబిసార అద్భుత విజయాన్ని నమోదు చేసింది. వరుస పరాజయాల్లో ఉన్న టాలీవుడ్ కి బింబిసార అరుదైన మూవీగా నిలిచింది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ బింబిసార చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కారు. ఆయన కెరీర్లోనే భారీ హిట్ గా బింబిసార నిలిచింది. అలా రెండో విజయాన్ని నమోదు చేసింది.

ధనుష్ పక్కన బైలింగ్వెల్ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న సంయుక్త మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల విడుదలైన సార్ సూపర్ హిట్ అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం వసూళ్లు దుమ్ములేపుతుంది. ఫస్ట్ వీక్ ముగియక ముందే లాభాల్లోకి వెళ్ళింది. దర్శకుడు వెంకీ అట్లూరి సామాజిక అంశాలతో కూడిన మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా సార్ తెరకెక్కించారు.తెలుగుతో పాటు తమిళంలో విడుదలైంది. సంయుక్త మీనన్ టీచర్ రోల్ చేశారు. ధనుష్ తో ఆమె కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. మొత్తంగా వరుస విజయాలతో హ్యాట్రిక్ పూర్తి చేసింది. ఈ క్రమంలో టాలీవుడ్ కి మరో లక్కీ హీరోయిన్ దొరికిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.