https://oktelugu.com/

Karnataka : ప్రియురాలి కోసం ప్రియుడు.. కూతురు కోసం తండ్రి.. ఎంత పనిచేశారు

చివరకు పరువు కోసం కుమార్తెను తానే పొట్టన పెట్టుకున్నానని కన్నీటిపర్యంతమవుతూ కృష్ణమూర్తి పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. పరువు కోసం అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెనే బలిపెట్టి ఆ తండ్రి తనకు తానే శిక్ష వేసుకున్నాడు. 

Written By:
  • Dharma
  • , Updated On : June 28, 2023 / 06:41 PM IST
    Follow us on

    Karnataka : ఇటీవల పరువు హత్యలు పెరుగుతున్నాయి. పిల్లలు వేరే కులం వారితో ప్రేమ సంబంధాలు నడుపుతున్నారని తట్టుకోలేకపోతున్నారు. క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడడమో.. లేక తామే పిల్లలను హత్య చేయడం చేస్తున్నారు. తాజాగా కర్నాటకలో ఇటువంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. పరువు కోసం అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను గొంతుకోశాడు ఓ తండ్రి. ఆత్మహత్యగా చిత్రీకరించాడు. కానీ చివరకు కటకటాలపాలయ్యాడు. ప్రియురాలి హఠాన్మరణాన్ని తట్టుకోలేని ఆ యువకుడు కూడా బలవంతంగా తనువు చాలించాడు.

    కర్నాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్స్డ్ (కేజీఎఫ్)లోని బంగారుపేటలో కృష్ణమూర్తి అనే వ్యక్తి కుటుంబంతో నివాసముంటున్నాడు. ఆయనకు కీర్తి అనే కుమార్తె ఉంది. ఆమె గంగాధర్ అనే వ్యక్తిని ప్రేమిస్తోంది. అతడ్నే పెళ్లి చేసుకోవాలని భావిస్తోంది. ఈ విషయంలో తండ్రిని ఒప్పించాలనే ప్రయత్నం చేస్తోంది. కానీ తండ్రి ఆ యువకుడు వేరే కులం వాడు కావడంతో  అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో తండ్రీ కుమార్తెల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. మంగళవారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఎంత చెప్పినా కుమార్తె వినకపోవడంతో తండ్రి కోపోద్రిక్తుడయ్యాడు. కుమార్తె గొంతు కోసి చంపాడు. ఫ్యాన్ కు చీరతో వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు.

    కీర్తి మరణించిందని తెలుసుకున్న ప్రియుడు గంగాధర్ తట్టుకోలేకపోయాడు. ఆమె లేని జీవితాన్ని ఊహించుకలేకపోయాడు. రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రేమికులిద్దరూ ఒకేసారి చనిపోయారు. దీంతో కీర్తి కూడా ఆత్మహత్య చేసుకుందని తండ్రి కృష్ణమూర్తి నమ్మించే ప్రయత్నం చేశాడు. కీర్తి మెడపై కోసి ఉండడం.. కృష్ణమూర్తి పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో పోలీసులు తమదైన రీతిలో విచారణ జరిపారు. చివరకు పరువు కోసం కుమార్తెను తానే పొట్టన పెట్టుకున్నానని కన్నీటిపర్యంతమవుతూ కృష్ణమూర్తి పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. పరువు కోసం అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెనే బలిపెట్టి ఆ తండ్రి తనకు తానే శిక్ష వేసుకున్నాడు.