RS 2 Thousand Note Ban : నల్లధనం మాట దేవుడెరుగు కానీ.. రూ.2 వేల నోటు రద్దుతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. చిరు వ్యాపారులు అవగాహన లేక రూ.2 వేల నోటు చూస్తుంటే అల్లంత దూరం పారిపోతున్నారు. స్వీకరించేందుకు ఇష్టపడడం లేదు. దీంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇలా ప్రకటన వచ్చిందో లేదో అలా దేశ వ్యాప్తంగా సర్క్యూలేట్ అయ్యింది.అయితే ఆర్బీఐ ఆదేశాలు, మార్గదర్శకాలపై అవగాహన లేక చాలా మంది రూ.2 వేల నోటు అంటేనే ఆందోళన పడుతున్నారు. ఎందుకొచ్చింది గొడవ అంటూ తిరస్కరిస్తున్నారు.
వాస్తవానికి రూ.2 వేల నోటును ఉపసంహరించుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఆ నోట్లను దేశంలోని 19 ప్రాంతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో మార్చుకునే అనుమతి ఇచ్చింది. అంతేకాదు బ్యాంకులు సైతం రూ.2 వే నోటును సర్కులేషన్ లో పెట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. రూ.2 నోట్లు ఉన్నవారు వచ్చే సెప్టెంబర్ 30 లోగా బ్యాంకుల్లో సబ్మిట్ చేసి మార్చుకోవాలని స్పష్టం చేసింది. ఒక్కొక్కరూ ప్రతి విడతలోనూ రూ.20 వేలు విలువైన నోట్లు మార్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈనెల 23 నుంచి రూ.2 వేల నోటు మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
సెప్టెంబరు 30 వరకూ నోట్ల మార్పిడికి ఆర్బీఐ అవకాశం ఇచ్చినప్పటికీ ఎక్కడికక్కడే వ్యాపారులు తీసుకోవడం లేదని ఫిర్యాదులు వెల్లవెత్తుతున్నాయి. దీంతో ఆర్బీఐ సీరియస్ ఆదేశాలు జారీచేసింది. రూ.2 వేల నోటు లీగల్ టెండరుగానే కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఏ కారణం చేతనైనా తీసుకోకపోతే కేసులు నమోదుచేస్తామని హెచ్చరించింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఈ రకమైన ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు తాజాగా అటువంటివే ఎదురవుతున్నాయి. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్లాక్ మనీ మాటేమిటో కానీ.. సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదన్న నిట్టూర్పులు ఎదురవుతున్నాయి. అయితే ఇది అంతిమంగా కేంద్ర ప్రభుత్వంపై అపవాదు పడుతోంది. దీనిని ఎలా అధిగమిస్తారో చూడాలి మరీ.