
Kiraak RP Chepala Pulusu- Rocking Rakesh: కిరాక్ ఆర్పీపై జబర్దస్త్ సీనియర్ కమెడియన్ రాకింగ్ రాకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకింగ్ రాకేష్ యాంకర్ ప్రశ్నకు సమాధానంగా ఆసక్తికరంగా స్పందించారు. జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో రాకింగ్ రాకేష్ ఒకరు. టీమ్ మేట్ గా ఎంట్రీ ఇచ్చిన రాకింగ్ రాకేష్ టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. చిన్నపిల్లలతో కామెడీ చేయడం ఆయన ప్రత్యేకత. ముగ్గురు నలుగురు చైల్డ్ ఆర్టిస్ట్స్ రాకింగ్ రాకేష్ టీమ్ సభ్యులుగా ఉండేవారు. వారి ముద్దు ముద్దు మాటలతో ఆరోగ్యకరమైన హాస్యం పండించేవాడు.
రాకేష్ త్వరలో జోర్దార్ సుజాతను వివాహం చేసుకోబోతున్నారు. వారికి నిశ్చితార్థం కూడా జరిగింది. తాజాగా రాకేష్ ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలో కిరాక్ ఆర్పీ మీద వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారం పెట్టి సక్సెస్ అయ్యారు. అది జబర్దస్త్ వలనే అంటారా? అని యాంకర్ అడిగారు. జబర్దస్త్ కమెడియన్స్ ఎవరు ఏం చేసినా జబర్దస్త్ బిక్షే. ఆ షో వలన వచ్చిన ఫేమ్ తో ఎదిగిన వాళ్ళే అన్నారు.
కిరాక్ ఆర్పీని మీరు ఎప్పుడైనా కలిశారా? అని అడగ్గా… నేను కలవలేదు. వాళ్ళు పెద్దవాళ్ళు, మేమేదో చిన్న ఆర్టిస్టులం. అంత అదృష్టం మాకు లేదని సెటైర్లు వేశారు. అప్పట్లో కిరాక్ ఆర్పీ మల్లెమాల సంస్థ మీద ఆరోపణలు చేశారు. దానికి మీరేమంటారు? అని అడగడం జరిగింది. జనాలకు తెలుసండి. ఈ విషయం గురించి మాట్లాడటం అనవసరం. సమయం వృధా, అని కొట్టిపారేశారు. రాకేష్ సమాధానం కిరాక్ ఆర్పీ ఆరోపణలు నిజం కాదన్నట్లుగా ఉంది.

జబర్దస్త్ గురించి మాట్లాడుతూ… అది మేము ఏర్పాటు చేసుకున్న వేదిక. దాదాపు 11 ఏళ్ళుగా నేను అక్కడే ఉన్నాను. చాలామంది వెళ్లిపోయారు. మళ్ళీ వచ్చారు. గొడవలు పడ్డారు. నేను, రాఘవ అన్న మాత్రం అక్కడే ఉన్నాము. నేను చిన్న పిల్లలతో కామెడీ చేయడం మంచిదైంది. నా స్కిట్స్ లో వల్గారిటీ ఉండదు. జబర్దస్త్ మీద చాలా కేసులు ఉన్నాయి. టీమ్ లీడర్స్ లో నా ఒక్కడి మీదే ఎలాంటి కేసు లేదు. కారణం నేను ఎవరినీ కించపరచను. ఒకరిని బాధ పెట్టి కామెడీ చేయడం సరికాదు. చార్లీ చాప్లిన్, బ్రహ్మానందం వంటి గొప్ప కమెడియన్స్ కూడా తమని తాము తగ్గించుకొని కామెడీ పంచారు. ఇతరులపై పంచ్లు వేసి, కించపరిచి చేసేది కామెడీ కాదని నేను నమ్ముతాను, అని రాకింగ్ రాకేష్ చెప్పుకొచ్చారు.