
Rocking Rakesh-Jordaar Sujatha: కొన్నాళ్లుగా రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. బుల్లితెర వేదికగా తమ ప్రేమను వ్యక్త పరుచుకున్నారు. జోర్దార్ సుజాతను ప్రేమిస్తున్నట్లు రాకింగ్ రాకేష్ పలుమార్లు ధ్రువీకరించారు. ఇటీవల ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. రాకేష్-సుజాతల ఎంగేజ్మెంట్ కి బుల్లితెర సెలెబ్రిటీలు, జబర్దస్త్ కమెడియన్స్ హాజరయ్యారు. అయితే నేడు మూడుముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటయ్యారని తెలుస్తుంది. ఈ జబర్దస్త్ ప్రేమికుల వివాహానికి తిరుమల తిరుపతి వేదికైంది. ఆ శ్రీవారి సన్నిధిలో ఏడడుగులు వేశారు.
రాకేష్ దంపతుల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా విషయం వెలుగులోకి వచ్చింది. వీరి పెళ్లి గోప్యంగానే జరిగినట్లు సమాచారం. కేవలం బంధువులు, అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. ఇక రాకేష్-సుజాతల పెళ్లి వార్త తెలిసిన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కలకాలం కలిసి ఉండాలని ఆశీర్వదిస్తున్నారు.
పెళ్ళికి ముందే సుజాత రాకేష్ ఇంటి సభ్యురాలిగా మారిపోయారు. ఏడాది కాలంగా సుజాత రాకేష్ ఇంట్లో ఉంటున్నారు. ఈ విషయాన్ని రాకేష్ తల్లిగారు స్వయంగా వెల్లడించారు. సుజాత మా ఇంట్లో అడుగుపెట్టాక సందడి వచ్చిందని, మరో చిన్నపిల్లలా అల్లరి చేస్తూ మాతో బాగా కలిసిపోయిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రాకేష్ కి అసలు వివాహం చేసుకునే ఆలోచన లేదట. చిన్న కొడుక్కి పెళ్ళై పిల్లలు కూడా పుట్టిన నేపథ్యంలో… పెద్ద కొడుకు రాకేష్ పెళ్లి విషయం వేధిస్తూ ఉండేదట. రాకేష్ మనసు మార్చి అతని జీవితంలోకి వచ్చిన సుజాత గొప్ప అమ్మాయంటూ ఆవిడ కొనియాడారు.

జోర్దార్ షోతో ఫేమస్ అయిన సుజాత బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్నారు. ఆ విధంగా మరింత ఫేమ్ రాబట్టారు. అయితే ఎక్కువ కాలం హౌస్లో ఉండలేదు. అనంతరం జబర్దస్త్ కమెడియన్ గా మారారు. అక్కడే రాకేష్ కి ఆమె దగ్గరయ్యారు. ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకున్నారు. జబర్దస్త్ వేదికగా కొన్ని ప్రేమలు జంటలు పుట్టాయి. అయితే వాళ్ళ ప్రేమలో క్లారిటీ లేదు. మొదట్లో రాకేష్-సుజాతలది కూడా ఉత్తుత్తి ప్రేమ అనుకున్నారు. పెళ్లి చేసుకొని కాదని నిరూపించారు. పెళ్లి చేసుకున్న మొట్టమొదటి జబర్దస్త్ ప్రేమికులుగా గుర్తింపు పొందారు. మరి రష్మీ-సుధీర్, వర్ష-ఇమ్మానియేల్ ఏం చేస్తారో చూడాలి.