Road Accident: పెళ్లయిన వారం రోజులకే నవ వరుడు దుర్మరణం పాలయ్యాడు. రోడ్డు ప్రమాదంలో అతనితో పాటు వధువు తండ్రి సైతం మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరితో పాటు మరో వ్యక్తి చనిపోయారు ఈ విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లా భూత్పూరు మండలం అన్నాసాగర్ వద్ద జరిగింది ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
వెంకటరమణ నంద్యాల జిల్లా రాచర్ల ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆయన ఏకైక కుమార్తె అనూషకు హైదరాబాదులోని మణికొండలో స్థిరపడిన పవన్ సాయికుమార్ తో ఈనెల 15న వివాహం జరిగింది. పవన్ ది కృష్ణాజిల్లా.కాగా వివాహం అనంతపురంలో జరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాదులో వరుడు నివాసముంటున్న ఇంట్లో విందు ఏర్పాటు చేశారు. దీనికి వధువు బంధువులు హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో భాగంగా రెండు కార్లతో అనంతపురం బయలుదేరారు. అన్నా సాగర్ వద్దకు రాగానే అతివేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనున్న రేయిలింగును ఢీకొట్టింది. తరువాత గాలిలోకి ఎగిరి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటరమణ, పవన్ సాయి, డ్రైవర్ చంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన అనూషను హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
వివాహ వేడుకలు జరిగిన వారం రోజులకే ఈ ఘటన జరగటంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. దాంపత్య జీవితంలోకి కొత్తగా అడుగుపెట్టిన నవవధువు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కుమార్తె అచ్చటా ముచ్చటా చూడకుండానే తండ్రి తనువు చాలించడం తీవ్ర విషాదాన్ని నింపింది. అంది వచ్చిన కుమారుడు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రుల రోధన అంతా ఇంతా కాదు. ఘటనా స్థలాన్ని మహబూబ్ నగర్ డిఎస్పి వెంకటేశ్వర్లు, సిఐ రామకృష్ణ పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More