80s Stars Reunion 2022: సినీ స్టార్స్ గెట్ టు గెదర్ తో సందడి చేశారు. 1980వ దశకంలో సినిమాల్లో నటించిన వాళ్లంతా ప్రతీ సంవత్సరం ఓ వేదికను ఏర్పాటు చేసుకొని సందడి చేస్తున్న విషయం తెలిసిందే. 2019లో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో తెలుగు, తమిళం, మలయాళం, హిందీకి చెందిన నాటి నటులు ఒక్కచోటుకు చేరి ఆడి పాడారు. అయితే 2020, 2021లో కరోనా కారణంగా గెట్ టు గెదర్ నిర్వహించలేదు. రెండేళ్ల తరువాత మళ్లీ వీరంతా కలుసుకుని ఎంజాయ్ చేశారు. ఈసారి బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీష్రాఫ్ ఇంట్లో కలుసుకోవడం ఆసక్తిగా మారింది. అయితే ఇందులో ప్రముఖ నటులు నాగార్జున, బాలకృష్ణ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

తెలుగు స్టార్ నటుడు మెగాస్టార్ చిరంజీవితో పాటు వెంకటేష్, అర్జున్, సీనియర్ నరేష్ లు ఈ వేడుకకు హాజరయ్యారు. తమిళం నుంచి భాగ్యరాజ్, శరత్ కుమార్ వచ్చారు. బాలీవుడ్ కు చెందిన అనిల్ కపూర్, రాజ్ బృందం ఉన్నారు. హీరోయిన్లలో రమ్యకృష్ణ, అంబికా, రాధ, లిజి, సుమలత, రేవతి లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నటులంతా వైఫ్ అండ్ హస్బెండ్ కాదని సింగిల్ గానే వచ్చి తమ తోటి నటులతో కలిసి అనుభవాలను పంచుకున్నారు. రాధిక మాత్రం తన భర్త శరత్ కుమార్ తో కలిసి వచ్చింది.
ఈ వేడుకలో బాలకృష్ణ , నాగార్జున కనిపించలేదు. బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్ 2’ తో పాటు ‘వీరసింహారెడ్డి’తో బిజీగా ఉన్నాడు. దీంతో ఆయనకు సమయం దొరకలేదు అని తెలుస్తోంది. అటు నాగార్జున ‘బిగ్ బాస్’తో తీరిక లేకుండా ఉన్నారు. దీంతో ఆయన కూడా ఈ వేడుకకు హాజరు కాలేదు. అయితే కొంత మంది 80’s నటుల్లో ఇప్పటికీ కొందరు సినిమాల్లో కొనసాగుతుండగా.. మరికొందరు ఇతర రంగాల్లో సెటిలైపోయారు. ఇంకొందరు విదేశాల్లో సెటిలై ఫ్యామిలీ వ్యవహారాలు చూసుకుంటున్నారు.

ఇక తాజాగా జరిగిన వేడుకలో తన పాత సంగతులన్నీ గుర్తు చేసుకున్నారు. ప్రతీ సంవత్సరం ఎంత బిజీ ఉన్నా ఒక్క చోట కలుసుకోవాలని అనుకున్నారు. ఈ రీ యూనియన్ తో ఎంతో ఉల్లాసంగా గడుపుతున్నామని కొందరు మాట్లాడారు. ఇదిలా ఉండగా గత యూనియన్ లో మెగాస్టార్ ఇంట్లో జరిగిన ఫంక్షన్ లో రజినీకాంత్, మోహన్ లాల్, బాలకృష్ణ లు హాజరయ్యారు. కానీ ప్రస్తుతం వారు లేకపోవడం కాస్త వెలితిగానే అనిపించింది. ఏదీ ఏమైనా స్టార్ల రీ యూనియన్ లో చాలా ఎంజాయ్ చేశామని కొందరు సోషల్ మీడియా వేదికగా ఫోటోలు షేర్ చేసి ఆకట్టుకున్నారు