Rafflesia Flower: ప్రపంచంలోనే అతి పెద్ద పుష్పం.. రాఫ్లేసియా. ఈ అరుదైన పుష్పం ప్రస్తుతం అంతరించిపోయే దశకు చేరుకుంది!. కొత్త పరిశోధనల ప్రకారం రాఫ్లేసియా దాని ఎరుపు రెక్కలపై మచ్చలను కలిగి ఉంటుంది. కుళ్లిన మాంసం వాసన కలిగి ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇది ఉనికిలో ఉండకపోవచ్చంటున్నారు పరిశోధకులు.
ఇది పరాన్నజీవి..
రాఫ్లేసియా ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పంగా పిలువబడుతున్నప్పటికీ నిజానికి ఇది ఒక పరాన్నజీవి. ఇది పువ్వు యొక్క మారువేషంలో ఉంటుంది. ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణమండల తీగలపై రాఫ్లేసియా వికసిస్తుంది. ఇండోనేషియా, బ్రూనై, మలేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌లలో ఈ పువ్వు ఎక్కువగా వికసిస్తుంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ పరిశోధకుల ప్రకారం ఈ పువ్వు జాతులలో ఒకటి అంతరించిపోతున్నట్లు తేలింది.
42 జాతులు..
మొక్కను బాగా అర్థం చేసుకోవడానికి మరియు దాని పరిరక్షణ స్థితిని సరిగ్గా గుర్తించడానికి, అంతర్జాతీయ వృక్షశాస్త్రజ్ఞుల బృందం మొత్తం ఐదు ఆగ్నేయాసియా దేశాలలో మొత్తం 42 రాఫ్లేసియా జాతులను పరిశీలించింది. వారి పరిశోధన ఆధారంగా, వృక్షశాస్త్రజ్ఞులు గతంలో తెలిసిన దానికంటే ఈ పువ్వు అంతరించిపోయే ప్రమాదం ఉందని నిర్ధారించారు. ‘60 శాతం రాఫ్లేసియా జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని మేము అంచనా వేస్తున్నాం‘ అని పీర్–రివ్యూడ్ జర్నల్‌లో పరిశోధకులు పేర్కొన్నారు. ‘ప్రపంచంలోని అత్యద్భుతమైన కొన్ని పుష్పాలను కాపాడేందుకు మాకు తక్షణమే క్రాస్–రీజనల్ విధానం అవసరం. వాటిలో చాలా వరకు ఇప్పుడు నష్టపోయే అంచున ఉన్నాయి’ అని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం యొక్క బొటానికల్ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ చిర్స్ థొరోగుడ్ అన్నారు. పరిమిత పరిస్థితుల్లో వికసించే ఈ పువ్వు మనుషులు, వాతావరణ మార్పు, పర్యావరణ విధ్వంసంతో అంతరించిపోతుందని పరిశోధకులు వెల్లడించారు.