IAS And IPS Register Marriage: ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని పెద్దవాళ్లు చెబుతుంటారు. ఇది అక్షరాల నిజం కూడా. సాధారణంగా పెళ్లిళ్లు అంటేనే హంగూ, ఆర్భాటాలు. ఇక ఖర్చుల సంగతి తెలిసిందే. బాజా భజంత్రీలు, విందులు, వినోదాలకు ఖర్చు పెట్టేందుకు వెనుకాడడం లేదు. కానీ ఇవేవీ లేకుండానే సింపుల్ గా మ్యారేజ్ చేసుకున్నారు మచిలీపట్నం జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్.
రాజస్థాన్ కు చెందిన అపరాజిత సింగ్ సిన్వర్.. అదే రాష్ట్రానికి చెందిన ట్రైనీ ఐపీఎస్ దేవేంద్ర కుమార్ ను వివాహమాడారు. మచిలీపట్నం కలెక్టరేట్లోనే తన కార్యాలయంలో జిల్లా రిజిస్టర్ సమక్షంలో అపరాజిత, దేవేంద్ర కుమార్ లు పెళ్లి చేసుకున్నారు. పరస్పరం దండలు మార్చుకున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది సమక్షంలోనే ఒకటయ్యారు.
ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందిన దేవేంద్ర కుమార్ ప్రస్తుతం హైదరాబాదులోని పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. వివాహం అనంతరం నూతన దంపతులు గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని శ్రీ కొండాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. నూతన దంపతులకు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నతాధికారులుగా ఉన్న వ్యక్తులు ఇలా సాధారణంగా వివాహం చేసుకోవడం విశేషం. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.