
Ramoji Rao Om City: కోర్టు చెప్పినా జగన్ వినిపించుకోవడం లేదు.. తన సిఐడి ద్వారా దూసుకు వస్తున్నాడు. అసలు విచారణ అంటే తెలియని రామోజీరావును విచారించాడు. మంచం మీద పడుకోబెట్టి మరీ ప్రశ్నలు అడిగించాడు. తన మీడియాలో రామోజీరావు ఫోటోలు వేసి టామ్ టామ్ చేశాడు. తర్వాత స్టెప్ ఏంటో అర్థం కావడం లేదు కానీ.. ఇప్పటికైతే రామోజీరావుకు ఇది పరాభవమే. తన దశాబ్దాల వ్యాపార చరిత్రలో ఒక తీరని కళంకమే. దీని నుంచి ఎలా బయటపడతాడు? బయటపడితే జగన్ ఏం చేస్తాడు? ఇవన్నీ పొలిటికల్ వర్గాల్లో సాగుతున్న చర్చలు.. అయితే వీటన్నింటిని కాదని ఒక అంశం మాత్రం మరుగున పడుతోంది. అది చర్చకు రావడం లేదు..అదే ఓం సిటీ..
రామోజీరావు అంటే ఈనాడు, మార్గదర్శి మాత్రమే కాదు విఖ్యాత రామోజీ ఫిలిం సిటీ కూడా. అబ్దుల్లాపూర్‌మెట్ లో సగం ఉంటుంది. కనుచూపు ఎక్కడిదాకా వెళ్తే అక్కడిదాకా రామోజీరావు సరిహద్దు ఉంటుంది. ఇందులో ప్రభుత్వ భూమి ఎంత? రామోజీరావు ఆక్రమించిన భూమి ఎంత? అటవీ శాఖ కు సంబంధించి స్వాధీనం చేసుకున్న భూమి ఎంత? అనే విషయాలను పక్కన పెడితే రామోజీ ఫిలిం సిటీ అనేది రామోజీరావుకు ఒక గుండెకాయ లాంటిది. తన గ్రూపు సంస్థల్లో మార్గదర్శి మాత్రమే లాభాల్లో ఉన్నప్పటికీ.. ఆయనకు అంతకుమించి పేరు తీసుకొచ్చింది ఈ రామోజీ ఫిలిం సిటీ. బాలీవుడ్ నుంచి భోజ్ పురి దాకా ఇందులో నిర్మాణం కాని సినిమా అంటూ లేదు. 365 రోజులు.. అక్కడ సందడే సందడి. మరి ఇలాంటి రామోజీ ఫిలిం సిటీ నిర్మించిన రామోజీరావు ఓం సిటీ పేరుతో ఒక ఆధ్యాత్మిక నగరిని సృష్టించాలి అనుకున్నాడు.
దీనికి సంబంధించి అనేక చర్చల తర్వాత చిన జీయర్ స్వామి, పండిట్ రవిశంకర్, జగ్గీ వాసుదేవ్, రాందేవ్ బాబా వంటి వారిని కలిశాడు. మొత్తానికి తుది రూపు వచ్చింది. దీనికి డబ్బులు సర్దుబాటు కోసం మార్గదర్శి నుంచి డబ్బులను ఇందులోకి మళ్లించారని ఒక ఆరోపణ ఉంది.. అందుకు తగ్గట్టుగానే మార్గదర్శిలో చీటీ పాడిన చందాదారులకు డబ్బులు వెంటనే ఇవ్వకపోగా, ఐదు శాతం వడ్డీతో ఇస్తామని కొత్త మెలిక పెట్టారు. దీనికి చందాదారులు కూడా ఓకే చెప్పటంతో రామోజీ పని సులువు అయింది. మార్గదర్శి నుంచి డబ్బుల ప్రవాహం ఓం సిటీ లోకి దర్జాగా ప్రవాహం సాగింది. కానీ జగన్ ఎప్పుడైతే సిఐడిని మార్గదర్శి మీదకి పంపించాడు అప్పుడే సీన్ రివర్స్ అయింది..

చంద్రబాబు ఆర్థిక స్తంభాలను కూలగొట్టాలని ఏకైక లక్ష్యంతో జగన్ మార్గదర్శి మీద మరింత ఒత్తిడి పెంచాడు. దీంతో రామోజీరావుకు ఉక్క పోత తప్పలేదు. మరోవైపు నిధుల లభ్యత తగ్గడంతో ఓం సిటీకి నగదు ప్రవాహం తగ్గిపోయింది. ఫలితంగా ఆ పనులు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ ఓమ్ సిటీ ఎక్కడ కడుతున్నారని కూడా బయటకి రానివ్వడం లేదంటే లేదంటే ఎంత గోప్యత పాటిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటికైతే దర్యాప్తులో వేగం ఉంది.. సిఐడి ఫుల్ స్వింగ్ లో ఉంది. జగన్‌లో ఆ తాలూకు కసి కనిపిస్తూనే ఉంది. ఎటొచ్చీ ఓం సిటీ పరిస్థితే అర్థం కాకుండా ఉంది.