
Jio Cinema IPL: పత్రికల పని అయిపోయింది. టీవీ ఛానల్స్ పని కూడా ముగింపుకు వచ్చింది. ఇప్పుడు ప్రతిదీ స్మార్ట్ ఫోన్ లోనే. యూట్యూబ్.. లేకుంటే ఓటీటీ.. ఎంటర్టైన్మెంట్ కు అర్థం పూర్తిగా మారిపోయింది. పైగా ఇందులో కోట్లకు కోట్ల లాభాలు కళ్ళకు కనిస్తున్న నేపథ్యంలో పెద్ద పెద్ద ప్లేయర్లు ఈ విభాగంలోకి వచ్చేస్తున్నారు.. ఆమధ్య టి20 మెన్స్ వరల్డ్ కప్ టోర్నీ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్, ఇండియా మధ్య మ్యాచ్ సరికొత్త రికార్డులను సృష్టించింది.. ఏకంగా 1.7 కోట్ల రియల్ లైవ్ వ్యూయర్ షిప్ తో సరికొత్త రికార్డులు సృష్టించింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయిన ఈ మ్యాచ్.. ఫుట్ బాల్ మ్యాచ్ ల రికార్డును కూడా బద్దలు కొట్టింది.. ఆ మ్యాచ్ స్ట్రీమ్ అవుతున్నంతసేపు డిస్నీ ప్లస్ స్టార్ సర్వర్లు విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొన్నాయి. అంతేకాదు కోట్ల కొద్ది అండార్స్మెంట్లు స్టార్ గ్రూప్ న కు వచ్చి పడ్డాయి.ఈ ఆదాయాన్ని చూశాడో లేక కొత్త వ్యాపారం లోకి రావాలి అనుకున్నాడో.. వెంటనే రిలయన్స్ అధినేత అంబానీ ఐపీఎల్ డిజిటల్ స్ట్రీమింగ్ లోకి వచ్చేసాడు.
ప్రస్తుతం ఐపీఎల్ 16వ ఎడిషన్ జరుగుతోంది. అయితే ఇవి మొదట్లో స్టార్ గ్రూప్ లో, తర్వాత సోనీ గ్రూప్లో మ్యాచ్ లు ప్రసారమయ్యేవి. ఓటీటీ లు అందుబాటులోకి వచ్చిన తర్వాత డిజిటల్ ప్రీమియర్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమయ్యేవి. ఈ ఏడాది నుంచి జియో సినిమాలో ఈ మ్యాచులు ప్రసారమవుతున్నాయి. ఇందుకుగాను ముఖేష్ అంబానీ భారీగా పెట్టుబడులు పెట్టాడు.. కని విని ఎరుగని ధరకు హక్కులు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో టీవీ, డిజిటల్ రైట్స్ కలిపి 44,075 కోట్లకు అమ్ముడు పోయాయి. డిజిటల్ హక్కులను రిలయన్స్ కంపెనీకి చెందిన “వయాకామ్ 18” గ్రూప్.. ₹20 వేల కోట్లకు పైగా వెచ్చించి ఈ హక్కులను కొనుగోలు చేసింది. అంటే ఒక్కో మ్యాచ్ ను డిజిటల్ విధానంలో ప్రసారం చేసినందుకు వయాకామ్ బీసీసీఐ కి 50 కోట్ల చొప్పున చెల్లిస్తోంది. ఈ ఒప్పందం 2027 వరకు ఉంటుంది.
ఇక ఈ మ్యాచులు స్ట్రీమ్ అవుతున్న జియో సినిమా యాప్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. మ్యాచులు స్ట్రీమ్ అవుతున్నప్పుడు రియల్ టైం లైవ్ వ్యూయర్ షిప్ సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది.. దగ్గర దగ్గర 1.9 కోట్ల వ్యూయర్షిప్ నమోదు అవుతోందని “వయాకాం 18” వర్గాలు చెబుతున్నాయి.. ప్రస్తుతానికి జియో టీవీకి కూడా విపరీతమైన అండర్స్మెంట్లు వస్తున్నాయి.. వయా కామ్ 18 పెట్టిన పెట్టుబడి అతి త్వరలోనే తిరిగి వస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక భిన్న వ్యాపారాల్లో ఉన్న ముఖేష్ అంబానీ డిజిటల్ వింగ్ లోకి కూడా రావడంతో పోటీ రసవత్తరంగా మారింది. కేవలం క్రికెట్ మ్యాచ్లు మాత్రమే కాకుండా ప్రాంతీయ భాషల్లో సినిమాలను కూడా కొనుగోలు చేయాలని రిలయన్స్ భావిస్తోంది.. అయితే ఈ విభాగంలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ పెద్ద ప్లేయర్లు గా ఉన్నాయి. వాటిని తట్టుకునే సామర్థ్యం మనదేశంలోని ఇతర ఓటీటీ సంస్థలకు లేదు. దీన్ని తట్టుకోవాలంటే భారీ వ్యాపార నేపథ్యం ఉన్న సంస్థకు మాత్రమే సాధ్యమవుతుంది.. అయితే ఈ విభాగంలోకి ముఖేష్ అడుగు పెట్టిన నేపథ్యంలో పోటీ మరింత రసవత్తరం గా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి అంబానికి ఓటీటీ రుచి తగిలిందని, ఇక దీన్ని వదిలిపెట్టడని వారు అంటున్నారు. చూడబోతే పరిస్థితులు కూడా అలానే కనిపిస్తున్నాయని వారు వివరిస్తున్నారు.