CM KCR- Early Elections: ‘ఆడవారి మాటలకూ అర్థాలే వేరులే.. ఔనంటె కాదనిలే.. కాదంటే ఔననిలే..’ ఇది మిస్సమ్మ చిత్రంలో తెలగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిమాన హీరో నందమూరి తారకరామారావు పాట. తర్వాత ఇది నానుడిగా మారిపోయింది. ఆ నానుడిని కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కచ్చితంగా ఫాలో అవుతున్నారన్న విమర్శ ఉంది. ఎందకంటే ఆయన ఏది ఔనంటారో అది చేయరు. నోటితో చెప్పిన ప్రతీ విషయాన్నీ నొసటితో కాదనడం కేసీఆర్‌కు బాగా తెలిసిన విద్య. ఈ విషయం ఆ పార్టీ నేతలతోపాటు తెలంగాణ ప్రజలకు కూడా ఇప్పటికే అర్థమైంది. అందుకే ఆయన ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని ఇటీవల ఎన్నిమార్లు ఉద్ఘాటించినా రాజకీయ వర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా నమ్మకం కనిపించలేదు. ఇంత గట్టిగా చెబుతున్నారు కనుక ముందస్తు ఖాయం అన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమైంది.

జిల్లాల టూర్ అందుకేనా..?
ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నానని సంకేతం ఇచ్చేలా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేకర్‌రావు ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చారు. ఎనిమిదేళ్లుగా సెక్రటేరియేట్‌కు వెళ్లకుండా.. ప్రగతి భవన్ నుంచి పాలన సాగించిన ‘సారు..కారు’ ఇప్పుడు జనం బాట పట్టారు. పార్టీ జిల్లా కార్యాలయాలు, కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవాల స్పీడ్ పెంచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభల్లో ఆయా జిల్లాలకు వరాలు కురిపిస్తున్నాడు. ప్రజలను ముందస్తు ఎన్నికలకు నెమ్మదిగా ట్యూన్ చేస్తున్నారు. మళ్లీ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
తెలంగాణ గడ్డపై నుంచే ఢిల్లీ పీఠానికి గురి..
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని చాలాకాలంగా కేసీఆర్ భావిస్తున్నారు. ఈమేరకు ఇప్పటికే టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చారు. ఈమేరకు ఎన్నికల సంఘం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇక తెలంగాణ గడ్డ మీద నుంచే ఢిల్లీ పీఠానికి గురిపెట్టాలనుకుంటున్నారు కేసీఆర్. అందుకోసం ముందుగా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను మళ్లీ అధికారంలోకి తేవాలని భావిస్తున్నారు. వాస్తవానికి టీఆర్‌ఎస్ సర్కార్‌కు పాలనకు ఇంకా ఏడాది సమయం ఉంది. కానీ, కేసీఆర్ ఈ ఏడాది పాలనకంటే.. వచ్చే ఐదేళ్ల పాలనపై దృష్టిపెట్టారు. ముందుగా తెలంగాణలో గెలిచి.. ఆ తర్వాత దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. ఈమేరకు ఆయన ప్రగతి భవన్ వీడి.. ప్రజాక్షేత్రంలోకి వచ్చారని గులాబీ నేతలతోపాటు రాజకీయ విశ్లేషకులూ అభిప్రాయపడుతున్నారు. పాలమూరు, జగిత్యాల జిల్లాల పర్యటనలో ఆయన ప్రసంగం మొత్తం ఎన్నికల ప్రచారాన్ని తలపించేలాగే ఉంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న ఉద్దేశాన్నే చాటాయి.
జాతీయ వ్యూహం మార్చి..
మొన్నటి వరకు జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని భావించారు. ఈమేరకు రాష్ట్రాల పర్యటన చేయాలని భావించారు. కానీ ప్రస్తుతం జాతీయ వ్యూహాన్ని మార్చి పూర్తిగా తెలంగాణ ఎన్నికలపైనే దృష్టి పెట్టారు. హామీలు, అభివృద్ధి పనులపై కాన్సంట్రేట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ముందస్తు ప్రసక్తే లేదని ప్రకటించిన కేసీఆర్ అందుకు పూర్తి భిన్నంగా ఎన్నికల సన్నాహాలలో నిమగ్నమైపోయారన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తరువాత కేసీఆర్ ముందస్తు ఉండదని నోటితో చెబుతూనే.. తెరవెనుక ముందస్తు సన్నాహాలు మొదలెట్టేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ పరంగా శ్రేణులకు దిశానిర్దేశం చేయడమే కాదు… పాలన పరంగా కూడా కేసీఆర్ దూకుడు పెంచారు. పాలమూరుతో ప్రారంభించి.. డిసెంబర్‌లో పలు జిల్లాల పర్యటనలకు షెడ్యూల్ రెడీ చేసుకున్నారు.
అభివృద్ధిని పట్టాలెక్కించే పనిలో..
యదాద్రి పవర్ ప్లాంట్ పర్యటన, మెట్రో విస్తరణ, సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించడం, అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి కసరత్తు, సొంత స్థలాలు ఉన్న వారికి ఆర్థిక సాయం ఇలా ఇంత కాలం పట్టించుకోకుండా వదిలేసిన పథకాలను పట్టాలు ఎక్కించబోతున్నారు. ఇక ఒక్కటొక్కటిగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఒక్కొక్కటి జారీ చేస్తున్నారు. హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్న కేసీఆర్ స్పీడ్ చూస్తుంటే ముందస్తు తథ్యమన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతోంది. ఒక వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనలతో పార్టీలో జోష్ పెంచుతుంటే.. మరో వైపు మంత్రి కేటీఆర్ గ్రేటర్ పరిధిలో కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు వరుస ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మరిన్ని కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముందస్తు ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమౌతోంది. అయితే ముందస్తు తేదీపై మాత్రమే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 12 నుంచి మూడు రోజులపాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లోనే ముందస్తు ప్రకటన చేస్తారా అన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది. ఒక వేళ ఈ అసెంబ్లీ సమావేశాలలో ముందస్తు ప్రకటన లేకుంటే మరో రెండు నెలల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అంత వరకూ వేచి ఉండి.. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువాత ముందస్తు ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా మార్చి లోగా ముందస్తు ప్రకటన ఖాయమన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోంది.

ఆరు నంబర్ కోసం..
కేసీఆర్ జోతిష్యాన్ని బలంగా నమ్ముతారు. ఆమేరకే వ్యక్తిగత, పార్టీ, ప్రభుత్వ పనులు చేస్తారు. సీఎం లక్కీ నంబర్ 6. అందుకే ఆ సంఖ్య కలిసి వచ్చేలా ముహూర్తం చూసుకుంటున్నారని తెలుస్తోంది. ఆరు నెలల ముందు ప్రభుత్వం రద్దు చేసి.. ఆరో తేదీన అభ్యర్థులను ప్రకటించి.. 6వ తేదీన ఎన్నికలు జరిగేలా కసరత్తు చేస్తున్నారు. అన్నీ కేసీఆర్ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సెప్టెంబర్– అక్టోబర్ మధ్యలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తన ప్రసంగాలు, ప్రకటనల ద్వారా ఒక వైపు ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలిస్తున్నారనీ, అదే సమయంలో మరో వైపు విపక్షాలను ముఖ్యంగా బీజేపీని తెలంగాణ ద్రోహిగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారనీ పరిశీలకులు పేర్కొంటున్నారు.
స్పీచ్‌లో తగ్గిన జోష్..
ప్రజాక్షేత్రంలోకి వెళ్లున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. అయితే ఆయనను మొదటి నుంచి పరిశీలిస్తున్నవారంతా కేసీఆర్ స్పీచ్‌లో దూకుడు తగ్గిందని, ఆయన మాటల్లో ఫైర్ కనపించడం లేదని, జోష్ లేకుండా చప్పగా ఉంటోందని అంటున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ వర్గాల నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైందో ఏమోగాని కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడే తీరు గతంలో కన్నా భిన్నంగా మాత్రం ఉంటున్నాయని అంటున్నారు. ఆయన పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతున్నారంటే ప్రజల్లో ఒక రకమైన ఆసక్తి, ఉత్కంఠ ఉండేది. ఆయన ప్రసంగంలో వాడే పదాలు, చెప్పే చలోక్తులు, విసిరే పంచ్‌లు, వినిపించే సెటైర్లలతో బహిరంగ సభకు వచ్చిన జనంలో మంచి ఊపు తెప్పిస్తుంటారు. పబ్లిక్ మీటింగ్ పూర్తయ్యే వరకు టీవీ ముందు వేలాది మంది కళ్లప్పగించి చూస్తుంటారు. ఇక యూట్యూబ్‌లో ఆయన స్పీచ్ వస్తున్నంత సేపు వ్యూయర్స్ సెల్ ఫోన్ వదలిపెట్టారు. ఇంత క్రేజ్ ఉన్న సీఎం కేసీఆర్ స్పీచ్‌లో కొన్ని రోజులుగా ఏదో వెలితి మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందనే టాక్ ఉంది.
పార్టీ శ్రేణుల్లో నిరాశ
మొన్న పాలమూరు, నిన్న జగిత్యాల బహిరంగ సభల్లో కేసీఆర్ స్పీచ్‌లో జోష్ లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. కొన్ని రోజులుగా జరుగుతోన్న రాజకీయ పరిణామాలపై సీరియస్ కౌంటర్ ఉంటుందని పార్టీ లీడర్లు ఆశించారు. కేంద్రంతో తాడోపేడో అనే తీరుగా స్పీచ్ ఉంటుందని భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈడీ, ఐటీ సోదాలు, సీబీఐ విచారణను ఆయన కనీసం ప్రస్తావించలేదు. పాత విషయాలనే మరోసారి చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడిన తీరును, ప్రస్తుతం బహిరంగ సభల్లోని ప్రసంగాల మధ్య చాలా వ్యత్యాసం ఉందని అభిప్రాయపడుతున్నారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా పై వ్యక్తిగతంగా విమర్శలు చేసిన కేసీఆర్ ఇప్పుడు ఆ విషయాలను కనీసం ప్రస్తావించడం లేదు. దీంతో ఏమై ఉంటుందని పార్టీ లీడర్ల మధ్య చర్చ కొనసాగుతున్నది
స్ట్రాటజీలో భాగమా?
కొన్ని రోజులుగా బీజేపీతో జరుగుతున్న రాజకీయ యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే టాక్ ఉంది. అందుకే ఆయన తన ప్రసంగంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తోన్న విధానాలపై మాత్రమే విమర్శలు చేశారు. కానీ వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లలేదు. కేంద్ర బీజేపీ లీడర్లు త్వరలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు జైలుకు వెళ్తారని పదేపదే చేస్తోన్న విమర్శలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఘాటుగా స్పందించిన దాఖలాలు ఉన్నాయి. పీఎం మోదీ,హోం మంత్రి అమిత్‌షాపై వ్యక్తిగత విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలపై విరుచుకపడ్డన రోజులు ఉన్నాయి. ఈడీ, బోడీ అంటూ విమర్శలు చేశారు. నన్ను ముట్టుకునే దమ్ము ఉందా? ముట్టుకుంటే మసైపోతారు అని హెచ్చరించారు. కానీ కేసీఆర్ ప్రస్తుతం ఎలాంటి కవ్వింపు మాటల జోలికి వెళ్లకుండా చాలా స్ట్రాటజీతో మాట్లాడారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.