Homeఆంధ్రప్రదేశ్‌Ramoji Film City : రామోజీ ఫిలిం సిటీ.. రామోజీరావు కష్టార్జితం కాదా..అవి పేదల ఇళ్ల...

Ramoji Film City : రామోజీ ఫిలిం సిటీ.. రామోజీరావు కష్టార్జితం కాదా..అవి పేదల ఇళ్ల స్థలాలా?

Ramoji Film City : రామోజీరావు హైదరాబాదులోని హయత్ నగర్ దాటిన తర్వాత అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో రామోజీ ఫిలిం సిటీని నిర్మించారు. ఫిలిం సిటీ అసలు విస్తీర్ణం ఇంతవరకు ఎవరికీ తెలియదంటే అది ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరగగా.. వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మార్గదర్శి వ్యవహారం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీ కి సంబంధించిన అనేక విషయాలు బయటపడటంతో సంచలనంగా మారాయి. అప్పటిదాకా రామోజీ ఫిలిం సిటీ రామోజీరావు కష్టార్జితం అని అందరు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటివారు తెరపైకి సంచలన ఆరోపణలు చేయడంతో రామోజీ ఫిలిం సిటీ కి సంబంధించిన అసలు విషయాలు వెలుగులోకి రావడం మొదలైంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామోజీ ఫిలిం సిటీ ని సర్వే చేయించాలని.. అందులో అసైన్డ్ భూములు ఉన్నాయని.. అవన్నీ పేదలకు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఇంతలోనే హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకోవడంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కన్నుమూశారు. ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీ భూముల సంబంధించిన అసలు విషయం వెలుగులోకి రాలేదు. కెసిఆర్ తెలంగాణ ఉద్యమంలో రామోజీ ఫిలిం సిటీని 1000 నాగళ్ళతో దున్నుతానని అన్నారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రామోజీ ఫిలిం సిటీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. చివరికి రామోజీరావు కు సంబంధించిన మార్గదర్శి వ్యవహారంలోనూ ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయినప్పుడు.. కెసిఆర్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఇక ఆమధ్య ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన బిగ్ డిబేట్ లో పాల్గొన్న కేటీఆర్.. రామోజీరావు అరెస్టు సంబంధించిన అసలు విషయాన్ని చెప్పారు. రామోజీరావు వృద్ధుడు కాబట్టి.. ఆయన అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి.. అరెస్టు చేయించలేదని వ్యాఖ్యానించారు. అంటే రామోజీరావు అక్రమాలు చేసినప్పటికీ కెసిఆర్ సైలెంట్ గా ఉన్నారని కేటీఆర్ పరోక్షంగా వ్యాఖ్యానించారు.

Also Read : రామోజీ ఫిలిం సిటీ పైకి హైడ్రా వెళ్తుందా? చెరలో ఉన్న చెరువులను కాపాడుతుందా?

సిపిఎం ఆధ్వర్యంలో..

ఇప్పుడు ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి లేకపోయినప్పటికీ రామోజీ ఫిలిం సిటీ వ్యవహారం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అలాగని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రామోజీ ఫిలిం సిటీపై చర్యలు తీసుకుంటుందని కాదు.. రామోజీ ఫిలిం సిటీ లో నిరుపేదలకు ఇండ్ల స్థలాలకు కేటాయించిన భూములను యాజమాన్యం కబ్జా చేసిందని సిపిఎం ఆరోపించింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల నియమితులైన జాన్ వెస్లీ పేదలతో కలిసి ఫిలిం సిటీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లిలోని రామోజీ ఫిలిం సిటీ వద్ద ఆర్ ఎఫ్ సీ ఇండ్ల పోరాట సమితి ఆధ్వర్యంలో ఫిలిం సిటీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. అయితే వారిని గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సిపిఎం నాయకులు, రామోజీ ఫిలిం సిటీ ఇండ్ల స్థలాల పోరాట సమితి నాయకులు పోలీసులను తోసుకుంటూ.. రామోజీ ఫిలిం సిటీ గేటు దూకి లోపలికి వెళ్లారు.. రోడ్డుమీద బైఠాయించి ఆందోళన చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమాని కంటే ముందు జాన్ వెస్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. ” పేదలకు ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిని రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం దర్జాగా కబ్జా చేసింది. ప్రభుత్వ రోడ్డుకు అడ్డంగా గోడకట్టి గేటు ఏర్పాటు చేసింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007 లో నాగన్ పల్లిలో సర్వే నెంబర్లు 203, 189 లో 20.4 ఎకరాలను 577 మంది పేదలకు ఇండ్ల స్థలాలుగా ఇచ్చారు. పట్టాలు కూడా అందజేశారు.. అయితే ఆ ఇళ్ల స్థలాల చుట్టూ రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం ప్రహరీ నిర్మించింది. అక్కడికి వెళ్లే ప్రభుత్వ రోడ్డుకు గేటు కూడా ఏర్పాటుచేసింది. పేదల ఇళ్లస్థలాలు కబ్జాపై సిపిఎం నాయకులు ధర్నా చేయడంతో.. ఆ స్థలాలను పేదలకు అప్పగిస్తామని ఫిలిం సిటీ యాజమాన్యం నాడు చెప్పింది. ఒకవేళ ఇక్కడ కాకుండా మరొకచోట భూమి పరుగులు చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం లే అవుట్ లాగా నిర్మించి అందిస్తామని లిఖితపూర్వకంగా కలెక్టర్ కు రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం హామీ ఇచ్చింది. 18 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఇంతవరకు పేదలకు న్యాయం జరగలేదు. వారికి న్యాయం జరిగేంతవరకు కదిలేది లేదని” జాన్ వెస్లీ స్పష్టం చేశారు. అయితే దీనిపై రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం ఇంతవరకు స్పందించలేదు. ఇక మిగతా మీడియా సంస్థల్లో దీనికి సంబంధించి వార్తలు కూడా పెద్దగా ప్రసారం కాలేదు.

Also Read : రామోజీ ఫిలిం సిటీ లో 1700 ఎకరాలు.. రామోజీ రావువి కావా? అందులో ఇంకొందరికి వాటా ఉందా?

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular