Rajasthan High Court: రాజస్తాన్ హైకోర్టు ఓ వినూత్న తీర్పునిచ్చింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న తన భర్తతో కాపురం చేసి తాను బిడ్డను కనాలని ఓ వివాహిత వేసిన పిటిషిన్ కు స్పందించి న్యాయస్థానం ఆమె కోరికను తీర్చింది. ఆమె కోరిక మేరకు భర్తకు పెరోల్ మంజూరు చేసి మానవతా దృక్పథం చాటింది. పిల్లల్ని కనడం జీవిత హక్కుగా భావించి ఆమె చేసిన విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుని తల్లయ్యేందుకు సహకరించేందుకు ముందుకు వచ్చింది. విచిత్రమైన తీర్పుగా రాష్ట్రంలో వైరల్ అవుతోంది.

రాజస్తాన్ లోని భిల్వారా జిల్లాకు చెందిన నందాలాల్ ఓ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అయితే అతడి భార్య తాను భర్తతో కలిసి సంసారం చేసి బిడ్డను కనాలని తన భర్తకు పెరోల్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు పిటిషన్ పెట్టుకుంది. అయితే కలెక్టర్ ఆమె పిటిషన్ ను పెండింగులో పెట్టడంతో ఏకంగా ఆమె హైకోర్టును ఆశ్రయించింది. తన భర్తతో తాను బిడ్డను కనాలని ఉందని దీనికి పెరోల్ మంజూరు చేయాలని అభ్యర్థించింది.
ఆమె అభ్యర్థనను న్యాయమూర్తులు సందీప్ మెహతా,ఫర్జాంద్ అలీతో కూడిన డివిజన్ బెంచ్ 15రోజుల పెరోల్ మంజూరు చేసింది. జైలులో ఉన్న తన భర్తలో బిడ్డను కనాలని మహిళ పెట్టుకున్న పిటిషన్ పై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే పదకొండు నెలల క్రితమే నిందితుడికి ఇరవై రోజుల పెరోల్ మంజూరు కావడం విశేషం. నందాలాల్ కు శిక్ష పడకముందే వివాహం జరిగింది. 2019 నుంచి అతడు అజ్మీర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

భారతీయ సంస్కృతి, మతతత్వ శాస్త్రం ఆధారంగా అతడికి పెరోల్ మంజూరు చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. వేదాలను కూడా పరిగణనలోకి తీసుకుని పిల్లల్ని కనడం ఓ హక్కుగా భావించి పెరోల్ మంజూరు చేసినట్లు చెబుతున్నారు. మొత్తానికి సదరు మహిళ న్యాయస్థానంలో పిటిషన్ వేసి తన భర్తను పెరోల్ పై విడుదల చేయించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో భవిష్యత్ లో ఇదే అంశంపై మరిన్ని పిటిషన్లు వచ్చే అవకాశముందని న్యాయవిశ్లేషకులు చెబుతున్నారు.