Rajanna Sircilla: ఒకవైపు జోరు వానలు.. మరోవైపు.. వేడివేడి మొక్కజొన్న కంకులు.. మిరపకాయ బజ్జీలు.. వేడి వేడి పకోడి.. నోరూరిస్తున్నాయి. ఈ చినుకుల్లో అవి కనిపించగానే నోట్లో నీళ్లు ఊరడం ఖాయం. అయితే ఈ చిన్న ఆశే రెండేళ్ల చిన్నారి ప్రాణం తీసింది. వలస జీవి ఇంటి విషాదం నింపింది. కుముంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం విరదండి గ్రామానికి చెందిన ఇగరపు మారుతి, కవిత దంపతులు ఉపాధి కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు వలస వచ్చారు. వీరికి క్రాంతికుమార్(13నెలలు) బాబు ఉన్నాడు. మారుతి ముస్తాబాద్‌లో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
వర్షం పడుతుందని…
వర్షం పడుతుందని సోమవారం మారుతి పనికి వెళ్లలేదు. దీంతో సాయంత్రం కవిత వేడివేడి పకోడి చేసింది. వర్షానికి పకోడి లాగించిన దంపతులు.. మిగిలిన కొన్నింటిని అక్కడే పక్కన ఉంచారు. అయితే ఆడుకుంటూ వెళ్లిన క్రాంతికుమార్.. ఓ పకోడి తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. కవిత పనిలో ఉండి ఈ విషయం గమనించలేదు. అయితే ఆ పకోడి బాబు గొంతులో చిక్కుకుని ఊపిరి ఆడక ఆపస్మాకర స్థితిలోకి వెళ్లాడు. చాలా సేపటికి గమనించిన కవిత ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే క్రాంతికుమార్ మృతి చెందాడని డాక్టర్ తెలిపాడు.
ఏడాది క్రితం ఇద్దరు కొడుకులు..
మూడేళ్ల క్రితం కవిత, మారుతి దంపతులకు ఇద్దరు కుమారులు ఆనారోగ్యంతో ఏడాది వ్యవధిలోనే మృతిచెందారు. దీంతో ఉన్న ఊరు కలిసి రావడం లేదని కూలీ పనుల కోసం ముస్తాబాద్‌కు వచ్చారు. ఇక్కడ కూడా ఆ దంపతులను విధి వెంటాడింది. మూడో కుమారుడిని కూడా విధి పకోడీ రూపంలో కబళించింది. అప్పటి వరకు ఆడుతూ ఉత్సహంగా కనిపించిన చిన్నారి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కవిత, మారుతితోపాటు చుట్టుపక్కల వారు కన్నీటి పర్యంతమయ్యారు.