
D. V. V. Danayya- Rajamouli: ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ గెలుచుకుంది. కానీ నిర్మాత దానయ్య ఎక్కడనే చర్చ జరిగింది. దానయ్య అమెరికా వెళ్ళలేదు. ఆస్కార్ తో పాటు ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఆతిథ్యం, గౌరవం దక్కిన ఏ అంతర్జాతీయ వేడుకలో పాల్గొనలేదు. ఆయన వెళ్లకపోయినప్పటికీ తమ సినిమాను రిప్రజెంట్ చేస్తున్నప్పుడు టీమ్ నిర్మాతకు క్రెడిట్ ఇవ్వాలి. అది జరగలేదు. ఆర్ ఆర్ ఆర్ టీంలో ఏ ఒక్కరు దానయ్య పేరు ప్రస్తావనకు తేలేదు. ఆర్ ఆర్ ఆర్ గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ వంటి రెండు ప్రతిష్టాత్మక అవార్డ్స్ గెలుచుకుంది. ప్రపంచ సినిమా ప్రియులకు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి పరిచయమయ్యారు. దానయ్య మాత్రం తెరవెనుక ఉండిపోయారు.
దీనిపై సొంత పరిశ్రమలోనే విమర్శలు, వ్యతిరేకతలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో అనేక పుకార్లు తెరపైకి వచ్చాయి. వరుస కథనాల నేపథ్యంలో డివివి దానయ్య స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ప్రచారం అవుతున్న రూమర్స్ కి ఆయన చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. నాకు ప్రచారం ఇష్టం ఉండదు. అందుకే అమెరికా వెళ్ళలేదు. ఇక అవార్డు కోసం డబ్బులు ఖర్చుపెట్టారంటున్నారు. నేనైతే ఖర్చు చేయలేదు. రాజమౌళి చేశారేమో తెలియదు.

ఒక సినిమా లాభాలే రూ. 80 కోట్లు ఉండదు. కాబట్టి ఇవ్వన్నీ పుకార్లే అన్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు చిరంజీవి డబ్బులు పెట్టారట. దానయ్య నిర్మాతగా ఉన్నప్పటి డబ్బులు చిరంజీవివి అని మరో వాదన తెరపైకి రాగా… ఆ వార్తలను కూడా ఆయన ఖండించారు. అమెరికా వెళ్లకపోవడానికి ప్రచార ఆర్భాటాలు ఇష్టం లేకే అని దానయ్య చెబుతున్నా అది నమ్మదగిన సమాధానం కాదు. ఆయన చెప్పింది నిజమే అనుకుందాం. ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఆయన పేరు ఎందుకు మరిచినట్టు? రాజమౌళి టీం దానయ్య ప్రస్తావన ఎందుకు తేలేదు..?
నిజానికి మొదట్లోనే దానయ్యను ఈ ప్రాజెక్ట్ నుండి రాజమౌళి లేపేయాలి అనుకున్నారు. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డకు ఆర్ ఆర్ ఆర్ అప్పగించాలని చూశారు. కొంత నిర్మాణం జరిగాక.. ఖర్చుపెట్టిన డబ్బులతో పాటు కొంత అమౌంట్ కలిపిస్తాం ప్రాజెక్ట్ నుండి తప్పుకోమన్నారు. దానయ్య దానికి ఒప్పుకోలేదు. ఎప్పుడో 2006లో ఇచ్చిన అడ్వాన్స్ కి రాజమౌళి దానయ్యకు సినిమా చేయాల్సి వచ్చింది. చెప్పాలంటే లాభాల రూపంలో ఆర్ ఆర్ ఆర్ వలన దానయ్యకు దక్కింది తక్కువే. మొదట్లోనే తప్పుకున్నా ఆయనకు నాలుగేళ్లు పడ్డ టెన్షన్ ఉండేది కాదు.