Raashi Khanna: గత ఏడాది రాశి ఖన్నా నుండి నాలుగు చిత్రాలు వచ్చాయి. రెండు తెలుగు, మరో రెండు తమిళ చిత్రాల్లో నటించారు. గోపీచంద్ పక్కా కమర్షియల్, నాగ చైతన్య థాంక్యూ డిజాస్టర్ అయ్యాయి. ఈ చిత్ర ఫలితాలు టాలీవుడ్ లో ఆమె అవకాశాలను తీవ్రంగా దెబ్బతీశాయి. తెలుగు దర్శక నిర్మాతలు ఆమెకు ఆఫర్స్ ఇచ్చే సూచనలు లేవు. ఆమె జర్నీ తెలుగులో ముగిసినట్లు అనిపిస్తుంది.

రాశి నటిగా ఎదిగింది తెలుగులోనే. మనం మూవీలో క్యామియో రోల్ చేసిన రాశి ఖన్నా… ఊహలు గుస గుస లాడే చిత్రంతో పూర్తి స్థాయిలో హీరోయిన్ గా మారారు. ఒక దశలో తెలుగులో వరుసగా చిత్రాలు చేశారు. 2019 వరకూ ఆమె కెరీర్ బాగుంది. ఆ ఏడాది ఆమెకు వెంకీ మామ, ప్రతిరోజూ పండగే వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడ్డాయి.
2020లో విజయ్ దేవరకొండకు జంటగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ కోలుకోలేని దెబ్బేసింది. ఆ మూవీలో విజయ్ దేవరకొండతో బెడ్ రూమ్ సన్నివేశాల్లో రాశి ఖన్నా నటించారు. ఛాలెంజింగ్ రోల్ కెరీర్ కి ప్లస్ అవుతుందనుకుంటే మైనస్ అయ్యింది. వరల్డ్ ఫేమస్ ప్లాప్ టాక్ తెచ్చుకోగా ఆమె ఆఫర్స్ తగ్గాయి. కోలీవుడ్ కి వలసెల్లిన రాశి ఖన్నా అక్కడ వరుసగా చిత్రాలు చేశారు.

2022లో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి థాంక్యూ, పక్కా కమర్షియల్ చిత్రాలు చేస్తే అవి పరాజయం పాలయ్యాయి. ప్రస్తుతం రాశి బాలీవుడ్ తో పాటు వెబ్ సిరీస్ల మీద ఫోకస్ పెట్టారు. రాశి ఖన్నా ఫార్జి టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేశారు. ఫిబ్రవరి 10 నుండి అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి కీలక రోల్స్ చేయగా క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందింది.

సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. రాశి ఖన్నాతో పాటు దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్నారు. యోధ సక్సెస్ అయితే బాలీవుడ్ లో ఆఫర్స్ వస్తాయని రాశి ఖన్నా ఆశపడుతున్నారు. ఆమె ఆశలు ఈ మేరకు నెరవేరుతాయో చూడాలి.