Teapot: రికార్డుల కోసం.. విలువైన వస్తువులను తయారు చేయడం చూస్తుంటాం. వస్తువు చిన్నదే అయినా విలువ మాత్రం భారీగా ఉండే రికార్డు వస్తువులు ప్రపంచంలో అనేకం ఉన్నాయి. విలువైన చెప్పులు, విలువైన టాయిలెట్లు, విలువైన బ్రాలు, వాచ్‌లు.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం తయారు చేసి రికార్డు సృష్టించారు. ఇలాంటి ఆలోచనేతోనే ఓ వ్యక్తి అందరి ఇళ్లలో ఉండే టీపాట్‌ను విలువైనదిగా మార్చాడు. సాధారణంగా టీపాట్ ధర ఎంత రూ.1000 వరకు ఉంటుంది. మరీ ప్రత్యేకమైనవైతే ఇంకొంచెం ఎక్కువ ధర ఉంటుంది. కానీ ఈ టీపాట్ ధర ఏకంగా రూ.24 కోట్లు. అత్యంత ఖరీదైన టీపాట్‌గా గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది.
లండన్‌లో తయారీ..
బ్రిటన్‌కు చెందిన ఎన్ సేథియా ఫౌండేషన్, లండన్‌లోని న్యూబీటీస్ సంయుక్తంగా తయారు చేయించిన ఈ టీపాట్‌ను ఇటాలియన్ స్వర్ణకారుడు ఫుల్వియో స్కావియా రూపొందించారు. 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన ఈ టీపాట్ చుట్టూ వజ్రాలను పొదిగారు. వాటి మధ్యలో 6.67 క్యారట్ల రూబీలను అమర్చారు.
ఈ టీపాట్ తయారీలో మొత్తం 1,658 వజ్రాలు, 386 థాయ్, బర్మీస్ కెంపులు ఉపయోగించారు. ఈ అద్భుతమైన టీపాట్‌కు ‘ది ఇగోయిస్ట్’ అని పెట్టారు. 2016లోనే దీని విలువ 3 మిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.24 కోట్లు. దీన్ని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీపాట్‌గా గిన్నిస్‌బుక్ తాజాగా గుర్తించింది. ఈ టీపాట్ ఫొటోలను, వివరాలను ట్విటర్‌లో షేర్ చేయగా యూజర్లను అమితంగా ఆకర్షిస్తున్నాయి.
చేయించింది మనోడే!
ఈ అత్యంత ఖరీదైన టీపాట్‌ను తయారు చేయించింది భారత సంతతి వ్యక్తి కావడం గమనార్హం. బ్రిటిష్–ఇండియన్ బిలియనీర్ నిర్మల్ సేథియా స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ఎన్ సేథియా ఫౌండేషన్ ఈ టీపాట్‌ను తయారు చేయించింది. మరో విశేషం ఏంటంటే దీని డిజైన్‌ను నిర్మల్ సేథియా స్వయంగా రూపొందించారు. టీ వ్యాపారి అయిన నిర్మల్ సేథియా ప్రపంచంలోని అత్యుత్తమ టీలకు అంకితమిచ్చేలా ఒక టీపాట్‌ను సృష్టించాలనుకుని దీనిని తయారు చేయించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది.