MLC Kavitha: ఆడవాళ్లు శపథం చేస్తే మంగమ్మ శపథం అంటారు. చాలెంచ్ చేసిందంటే నెరవేరుతుందన్న అభిప్రాయం అనాదిగా వస్తోంది.నాటి ద్రౌపతి శపథమే మహాభారత యుద్ధానికి దారితీసిందంటారు. ఆడవాళ్ల పంథంలో రాజ్యాలే కూలిపోయిన ఘటనలు చరిత్రలో ఉన్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి గారాల తనయ.. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఒక శపథం చేసింది. అది తాను లిక్కర్ స్కాం చేయలేదని కాదు.. తనను 2019 లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడించిన ధర్మపురి అర్వింద్‌ను 2024 ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తానని. ఎంపీ ఎన్నికల్లోనే కాదట.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా వెంటబడి అక్కడికి వెళ్లి మరీ ఓడిస్తానని ప్రకటించారు కవిత. తనది నిజామాబాదేనని తన కట్టె కాలేవరకు నిజామాబాద్ లోనే ఉంటానని సెంటిమెంట్ డైలాగ్ వదిలారు. అయితే కవితది నిజామాబాద్ ఎలాగైందో ఆమె చెప్పాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇక్కడి నుంచి ఒకసారి పోటీచేసి గెలిచారు. తర్వాత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు.
తనను ఓడించారన్న కసితోనే…
రెండోసారి పోటీచేసినపుడు అర్విందే గెలిచారు. బహుశా తనను అర్వింద్ ఓడించారనే మంట కవితలో ఇంకా రగులుతూనే ఉంది. అది క్రమంగా పెరుగుతూనే ఉన్నట్లు అనిపిస్తుంది. అర్వింద్‌ను ఓడించే వరకు ఆ మంట చల్లారేలా కనిపించడం లేదు. ఇంత వరకు ఓకే అయినా అర్వింద్‌ను ఓడించేందుకు కవిత ఏం చేయబోదున్నారు.. కార్యాచరణ ఏమిటి అనేది ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే ఎంపీగా ఓడిపోయిన తర్వాత చాలా కాలం అసలు నిజామాబాద్ వైపే చూడలేదు. ఎమ్మెల్సీ అయిన తర్వాత నిజామాబాద్‌ను కవిత పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో నిజామాబాద్‌లో మళ్లీ కనిపిస్తున్నారు. ప్రెస్‌మీట్లు పెట్టి..‘నాది నిజామాబాద్.. నా కట్టె కాలేది ఇక్కడే’ అని డైలాగ్స్ వదులుతున్నారు.
మళ్లీ ఎంపీ బరిలో..
రాబోయేఎన్నికల్లో కవిత మళ్లీ ఎంపీగా పోటీచేయబోతున్నారట. తనకు ప్రత్యర్ధిగా అర్విందే ఉంటారన్న అంచనాతోనే ఎంపీని ఓడిస్తానని శపథం చేసింది. నిజామాబాద్ ఎంపీగా కాకుండా అర్వింద్ కోరుట్ల ఎమ్మెల్యేగా పోటీచేసినా సరే ఓడించటం ఖాయమని చెప్పేశారు. అంటే అర్వింద్ పోటీపై కవితకు అనుమానమున్నట్లుంది.
ఎమ్మెల్యే బరిలో బీజేపీ ఎంపీలు..
ఇదిలా ఉంటే.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఎంపీలందరూ కచ్చితంగా ఎమ్మెల్యేలుగా పోటీచేయాలని బీజేపీ అగ్రనేతలు పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. తాను ఫలానా నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని ఇప్పటివరకు అర్వింద్ ఎక్కడా ప్రకటించలేదు. అయితే కవిత మాత్రం కోరుట్లలో పోటీచేసినా ఓడిస్తానంటున్నారు.
కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదట..
మరి కాంగ్రెస్ మాటేమిటన్న ప్రశ్నకు రాబోయే ఎన్నికల్లో హస్తం పార్టీ జిల్లా మొత్తంమీద ఒక్కసీటు కూడా గెలవదని జోస్యం చెప్పేశారు. బీఆర్‌ఎస్–బీజేపీలు గెలుపుకోసం గట్టిగా ప్రయత్నించినపుడు మధ్యలో కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలుంటాయని కవిత మరచిపోయినట్లున్నారు. ఇంతచెప్పినా మాజీ ఎంపీ కేసీఆర్ ప్రభుత్వంపై జనాల్లోని వ్యతిరేకతను పట్టించుకున్నట్లు లేదు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.