Prabhu Deva: నేను ఆడితే లోకమే ఊగదా.. మిస్సమ్మ( శివాజీ హీరో) సినిమాలో భూమిక పాడిన పాట అది. ఈ పాట ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా కు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. అతడు స్టెప్పులు వేస్తే యావత్ భారతమే ఊగిపోయింది. ఊర్వశి ఊర్వశి అంటూ 90 ల్లో ఆయన వేసిన స్టెప్పులకు ఫిదా అయింది.” ముక్కాలా ముక్కాబుల్లా ఓ లైలా” అంటూ వేసిన డ్యాన్స్ కు యువత శివాలూగింది. 90 ల్లోనే కాదు, మిలీనియం లో, ఈ కాలంలోనూ ప్రభుదేవాకు తిరుగులేదు. ఒంట్లో ఎముకలే లేనట్టు అతడు వేసే స్టెప్పులకు యావత్ దేశమే డాన్స్ చేస్తుంది. అయితే అలాంటి ప్రభుదేవా ఒక పాటకు వేసిన డాన్స్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇప్పటికే ఈ వీడియో మిలియన్ వ్యూస్ నమోదు చేసుకుంది.
ప్రభుదేవా తన సినీ కెరియర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. దక్షిణాదిలో, ఉత్తరాదిలో కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా.. పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్, వాంటెడ్, బాలీవుడ్లో రౌడీ రాథోడ్ వంటి సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. తమిళ్, తెలుగు సినిమాల్లో మెయిన్ లీడ్ యాక్టర్ గా, సపోర్టింగ్ రోల్స్ లోనూ నటించారు. అలాగని తన కొరియోగ్రఫీకి ఏనాడూ విరామం ప్రకటించలేదు. పేరుపొందిన కొరియోగ్రాఫర్ అయినప్పటికీ తన సినిమాల్లో ఇతర కొరియోగ్రాఫర్లకు కూడా అవకాశాలు ఇచ్చారు. డ్యాన్స్ రియాల్టీ షోలకు జడ్జిగానూ వ్యవహరిస్తున్నారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి.. నయనతారతో ప్రేమాయణం సాగించారు. ఆ తర్వాత కొంతకాలానికి వారిద్దరూ విడిపోయారు. ఇటీవల ఓ యువతిని పెళ్లి చేసుకుని.. 50 సంవత్సరాల వయసులో ఒక బిడ్డకు తండ్రి అయ్యారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రభుదేవా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది తెగ సర్కులేట్ అవుతోంది.
2018లో ప్రభుదేవా ప్రధాన కథానాయకుడిగా తమిళంలో గులేబకావళి అనే సినిమా ఒకటి విడుదలైంది. ఈ సినిమాలో ప్రభుదేవా కు జోడిగా నిక్కీ గర్లానీ నటించింది. ఈ సినిమాలో “గులేబా” అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది. ఈ పాటకు ప్రభుదేవా విభిన్నమైన రీతిలో డాన్స్ వేస్తారు. వివేక్ మెర్విన్ ఈ పాటకు బాణీలు సమకూర్చగా.. అనిరుధ్ రవిచంద్రన్ పాడారు. ఈ పాటను యూట్యూబ్లో విడుదల చేస్తే ఇప్పటికి 24 కోట్ల మంది చూశారు. యూట్యూబ్ మ్యూజిక్ విభాగంలో ఈ పాట ఇప్పటికీ ముందు వరుసలోనే ఉంటుంది. ఈ పాటకు సంబంధించి అప్పుడు ప్రభుదేవా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ లో అప్ లోడ్ చేశారు. దీనికి సంబంధించి తీసిన వీడియో తక్కువ క్వాలిటీతో ఉందని రాసుకొచ్చారు. అయితే దీన్ని చూసిన ఆయన అభిమానులు వీడియో క్వాలిటీ లో, డ్యాన్స్ మాత్రం 4k లో ఉందంటూ వ్యాఖ్యానించారు.. ఈ వీడియోలో ప్రభుదేవా వేస్తున్న స్టెప్పులు ఆయన అభిమానులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా ఒంట్లో ఎముకలేనట్టుగా ఆయన డ్యాన్స్ చేసిన తీరు అబ్బురపరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్నది.
View this post on Instagram