
Kondagattu Temple Theft Case: జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో చోరీకి పాల్పడ్డ ముగ్గురు దొంగలను జగిత్యాల పోలీసులు పట్టుకున్నారు. కేసు విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండుసార్లు రెక్కి నిర్వహించిన దొంగలు.. చివరకు వెండి అభరణాలను ఎత్తుకెళ్లారు. వారిని ఆశ్చర్యకరంగా ఓ బీరు సీసా పట్టించింది.
15 కిలోల వెండి ఆభరణాల అపహరణ..
కొండగట్టు అంజన్న ఆలయంలో గత నెల 23 అర్ధరాత్రి చొరబడిన దొంగలు.. 15 కిలోల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. శఠగోపం, వెండి గొడుగు వెండి రామ రక్ష ఇలా వివిధ రకాల వస్తువులు అందులో ఉన్నాయి. కేసును సవాలుగా తీసుకున్న జగిత్యాల పోలీసులు.. సాంకేతికతో చాకచాక్యంగా చోరులను పట్టుకున్నారు.
రెండుసార్లు రెక్కీ..
చోరీకి ముందే దొంగలు రెండుసార్లు రెక్కి నిర్వహించారు. గత నెలలో సీఎం కేసీఆర్ ఆలయానికి రాగా, అంతకు ముందే ఒకసారి రెక్కీ నిర్వహించి వెళ్లారు. మొదట అనుకూలంగా లేక పోవటంతో, మళ్లీ గత నెల 22న పసుపు రంగు దుస్తుల్లో భక్తుల రూపంలో వచ్చి రెక్కీ నిర్వహించారు. 23వ తేదీన అర్ధరాత్రి దాటాక ఆలయంలో చొరబడ్డ దొంగలు.. 15 కిలోల వెండి అభరణాలు అపహరించుపోయారు.

చోరీ తర్వాత బీర్లు తాగి..
చోరీ పూర్తయ్యాక.. తీరిగ్గా ఆలయం వెనకాల బీర్లు తాగి అక్కడే పడేశారు. ఆ బీరు సీసానే దొంగలను పట్టించింది. డాగ్ స్కాడ్‌తో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాబిన్ అనే జాగిలం.. దొంగలు తాగి పడేసిన బీరు సీసా వద్దకు వెళ్లి ఆగింది. బీరు సీసాపై ఉన్న వేలి ముద్రల ఆధారంగా ఆధునిక సాంకేతికతో, నిందితుని ఆధార్‌ను గుర్తించారు. చిరునామా తెలుసుకుని కర్ణాటక బీదర్‌లో ఉన్న నిందితుల్ని 10 బృందాలుగా వెళ్లి పట్టుకున్నారు. ముగ్గురు పట్టుబడగా, పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలిస్తున్నారు.
కొండగట్టు ఆలయ చోరీ కేసు దర్యాప్తులో కీలకమైన సాక్ష్యాన్ని పోలీస్ జాగిలం రాబిన్ గుర్తించింది. రాబిన్‌కు ఎస్పీ ప్రత్యేక థ్యాంక్యూ చెప్పారు.