Plane Crash Amazon Forest: అమెజాన్ వంటి దట్టమైన అడవిల్లోకి సాధారణ వ్యక్తులు ఎవరైనా వెళితే ప్రాణాలతో బయటకు పడటం అసాధారణం. అటువంటి ఏకంగా ఆ చిన్నారులు 17 రోజుల పాటు ఆ కారడవిలో తిరిగారు. ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో 11 నెలల పసిపాప కూడా ఉండటం విశేషం. కొలంబియాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ‘‘ఆపరేషన్ హోప్’’ పేరిట ఆ దేశం చేపట్టిన ఆపరేషన్ విజయవంతం కావడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దేశానికి సంతోషకరమైన రోజని ఆ దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో ప్రకటించారు.
దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో రోడ్డు మార్గాలు సరిగా ఉండవు. అందువల్ల రాకపోకలకు విమానాలపైనే చాలా మంది ఆధారపడతారు. అలా, మే 1వ తేదీన అమెజాన్ లోని అటవీ ప్రాంతం పరిధిలో ఉన్న అరారాక్యూరా నుంచి శాన్ జోస్ డెల్ గ్వావియారే ప్రాంతానికి విమానంలో పైలెట్ తో సహా ఏడుగురు బయల్దేరారు. కొంతసేపటిలో టేకాఫ్ అవుతుందనగా విమానం కూలిపోయింది. రాడార్ నుంచి సిగ్నల్ కట్ అయిపోయ్యింది. అలర్ట్ అయిన అధికారులు విమానం కూలిపోయిన ప్రదేశంలో గాలింపు చర్యలు చేపట్టారు.
‘ఆపరేషన్ హోప్’ పేరిట ఆపరేషన్ చేపట్టింది. మృతులను, క్షతగాత్రులను కాపాడేందుకు కొలంబియా దేశం సైన్యాన్ని రంగంలోకి దింపింది. దట్టమైన అటవీ ప్రాంతంలో వెతుకులాట కష్టంగా మారింది. ఎట్టకేలకు మూడు రోజుల క్రితం రెండు మృతదేహాలను కనుగొన్నారు. మిగతా వారి జాడ తెలియరాలేదు. వీరిలో 13, 9, 4 ఏళ్ల చిన్నారులతో పాటు 11 నెలల పసి బిడ్డ ఉన్నట్లు గుర్తించారు. చిన్నగుడారం, జట్టుకు కట్టుకునే రిబ్బన్, పాలసీసా, సగం తిన్న పండు కనబడంతో చిన్నారులు సజీవంగా ఉన్నారని నిర్థారణకు వచ్చారు.
దాంతో వెతుకులాటను ముమ్మరంగా చేసిన సైన్యం అక్కడికక్కడే చిన్నారులు తిరుగుతున్నట్లు గుర్తించారు. ఎట్టకేలకు 17 రోజుల తరువాత సురక్షితంగా కాపాడారు. అయితే, ఆ ప్రాంతంలో రహదారి కూడా ఉండదు. బయటి వారు ఎవరూ అక్కడ తిరగలేరు. వీరు అన్ని రోజులు ఎలా ప్రాణాలతో ఉన్నారనేది మిస్టరీగా మారింది. కాగా, ఆపరేషన్ హోప్ విజయవంత కావడంతో ఆ దేశంలో సంబరాలు మిన్నంటాయి.